రైతు ‘భరోసా’కు కొత్త మెలికలు!

ABN , First Publish Date - 2021-05-20T09:07:40+05:30 IST

వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌’ పథకం లబ్ధిదారులను కుదించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. ఒక రేషన్‌ కార్డులో రైతుభరోసాకు ఇద్దరు అర్హులున్నా, అందులో ఒక్కరికే పెట్టుబడి సాయం అందిస్తామంటూ మెలిక పెట్టింది. దీంతో వందలాది మంది లబ్ధిదారులు ఈ ఏడాది రైతుభరోసాకు అర్హత

రైతు ‘భరోసా’కు కొత్త మెలికలు!

లబ్ధిదారుల కుదింపునకు సర్కార్‌ ఎత్తుగడ

ఒక రేషన్‌ కార్డులో ఇద్దరు అర్హులున్నా.. ఒక్కరికే లబ్ధి 

ఈ ఏడాది అర్హత కోల్పోతున్న వందలాది లబ్ధిదారులు

13,500 కోసం కుటుంబాలు విడిపోవాలా? 

యువరైతుల ఆగ్రహం.. గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు

పట్టించుకోని వ్యవసాయశాఖ


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌’ పథకం లబ్ధిదారులను కుదించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. ఒక రేషన్‌ కార్డులో రైతుభరోసాకు ఇద్దరు అర్హులున్నా, అందులో ఒక్కరికే పెట్టుబడి సాయం అందిస్తామంటూ మెలిక పెట్టింది. దీంతో వందలాది మంది లబ్ధిదారులు ఈ ఏడాది రైతుభరోసాకు అర్హత కోల్పోతున్నారు. కానీ, గతేడాది కంటే ఎక్కువ మందికే పెట్టుబడి సాయం అందిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. గతేడాది లబ్ధిపొందినా.. 2021-22లో అనర్హులవడానికి  సర్కార్‌ తాజాగా నాలుగు నిబంధనలు ప్రవేశపెట్టింది. వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరణలు సరిగ్గా లేకపోయినా, జీఎస్టీ చెల్లిస్తున్నా, లబ్ధిదారుడైన యువరైతు చదువుకొనసాగిస్తున్నా.. వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. అలాగే ఒక రేషన్‌ కార్డులో ఇద్దరు సభ్యులు ఉంటే.. ఒక్కరికే భరోసా ఇస్తామని, మరొక సభ్యుడి అర్హత విషయం ధ్రువీకరణ ప్రక్రియలో ఉంటే పెట్టుబడి సాయం అందదని వ్యవసాయశాఖ యాప్‌లో స్పష్టం చేసింది.


ఈ కారణంగా రైతుభరోసా లబ్ధి కోసం ఒకే రేషన్‌కార్డులో ఉన్న రెండో సభ్యుడి కుటుంబం విడిగా రేషన్‌ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త రేషన్‌ కార్డుల జారీ చేస్తున్న దాఖలా లేదు. దీంతో సర్కార్‌ కొత్త మెలికతో ఒక కార్డులోని ఒక రైతు కుటుంబం భరోసాను కోల్పోతోంది. ఈనెల 13న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతుభరోసా-పీఎం కిసాన్‌ తొలి కిస్తీని ఆన్‌లైన్‌లో జమ చేస్తూ బటన్‌ నొక్కినా, ఈ నాలుగు కారణాల వల్ల  ఆయా రైతుల ఖాతాల్లో ఇప్పటికీ సొమ్ము జమ కాలేదు. ఈ విషయం బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా తెలుసుకున్న రైతులు సర్కార్‌ తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ పెట్టుబడి సాయం కోసం కుటుంబాలు విభజన కావాలా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.13,500 కోసం ఒక తండ్రి రేషన్‌కార్డులో ఉన్న కుమారుడి కుటుంబం ఆ కార్డు నుంచి విడిపోవాలా?  అని బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు ఈనెలలో ప్రభుత్వం జమ చేసిన రైతుభరోసా సొమ్ము ఖాతాలకు జమ కాకపోతే, గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసి, ఆధార్‌ నంబరు లింక్‌ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.


కానీ, గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా.. వారం రోజులుగా పట్టించుకోలేదని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు బుధవారం ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తెచ్చారు. ఆయా కారణాలతో రైతుభరోసా సొమ్ము జమ పడటం లేదని, త్వరలో గ్రీవెన్స్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయితే, ఫిర్యాదులను పరిశీలించి, అన్ని అర్హతలు ఉంటే రైతుభరోసా సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏపీ వ్యవసాయశాఖ యాప్‌లో ప్రకటించింది. 

Updated Date - 2021-05-20T09:07:40+05:30 IST