ఇడుపులపాయకు చేరుకున్న జగన్‌, షర్మిల

ABN , First Publish Date - 2021-09-02T09:00:14+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం ఇడుపులపాయ

ఇడుపులపాయకు చేరుకున్న జగన్‌, షర్మిల

  • రాత్రి భోజనం కలిసే చేసిన అన్నా చెల్లి!
  • నేడు వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు 


కడప, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం ఇడుపులపాయ చేరుకున్నారు. ఇద్దరూ సాయంత్రానికి వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకున్నా రాత్రి వేర్వేరు బంగ్లాల్లో బస చేసినట్లు తెలిసింది. అయితే రాత్రి భోజనాలు అన్న, చెల్లెలు కలిసే చేశారని విశ్వసనీయ సమాచారం. సీఎం జగన్‌ బుధవారం సాయంత్రం 5.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కలెక్టర్‌తో కలిసి జగన్‌ ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ స్థానిక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌ్‌సకు చేరుకొని అక్కడే బస చేశారు. కాగా, హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరిన షర్మిల సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయ వెళ్లారు.


ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఎస్టేట్‌, ఘాట్‌లో వర్ధంతి ఏర్పాట్లను పరిశీలించారు. వైఎస్‌ విజయలక్ష్మి ఆలస్యంగా ఇడుపులపాయ చేరుకున్నారు. నేడు వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకొని 8.30 నుంచి 10 గంటల మధ్య వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో అన్నా చెల్లెలు పాల్గొంటారు. అనంతరం షర్మిల కడపకు చేరుకొని ప్రత్యేక ఫ్లైట్‌లో హైదరాబాద్‌ వెళతారు. సీఎం జగన్‌ పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో గన్నవరం చేరుకుంటారు.

Updated Date - 2021-09-02T09:00:14+05:30 IST