వైసీపీ మౌనం రాష్ట్రానికి మోసం
ABN , First Publish Date - 2021-12-09T07:57:49+05:30 IST
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం ఆమరణ దీక్ష, బంద్‌లు,

- మొన్న ప్రత్యేక హోదాకు చెల్లుచీటీ
- నేడు రైల్వే జోన్‌కు కేంద్రం మంగళం
- అడగనిదే అమ్మయినా పెడుతుందా?
- రాజకీయ వర్గాల ఆగ్రహం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం ఆమరణ దీక్ష, బంద్‌లు, ఉద్యమాలు చేశారని.. అధికారంలోకి వచ్చాక గట్టిగా అడగడమే లేదని.. అలాగే లోక్‌సభలో 22 మంది ఎంపీలున్నా.. రైల్వేజోన్ కోసం కృషి చేయడం లేదని రాజకీయ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ‘ఎవరైనా గట్టిగా అడిగితేనే కదా స్పందించేది! పోరాట పటిమే చూపకుండా వెన్ను చూపితే ఇలాగే అన్నీ పోతాయి’ అని స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్ కోసం పోరాటాలు చేసింది. ఏపీ అంటే వైసీపీనే అని ప్రచారం చేసుకుంది. కుంభకోణాల నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్రంలోని మోదీ సర్కారుతో రాజీపడ్డారని, అందుకే ప్రత్యేక హోదా, రైల్వేజోన్ గురించి పోరాటం చేయడం లేదని నాటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమంటూ 2015 అక్టోబరు 7న గుంటూరు జిల్లా నల్లపాడులో ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కుమ్మరించారు. రాష్ట్రానికి హోదా రాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. 2016 ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు జగన్ పిలుపిచ్చారు. తమకు 25 మంది ఎంపీలను ఇస్తే పార్లమెంటులో కేంద్రం మెడలు వంచి హోదా సాధించి తెస్తానని శపథం చేశారు. అనంతరం 2018 ఏప్రిల్‌లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వేదికగా వైసీపీ ఆందోళనకు దిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, కేంద్రం తమ నమ్మకాన్ని కోల్పోయిందంటూ కేవలం ఐదుగురు ఎంపీలున్న ఆ పార్టీ ఏకంగా అవిశ్వాస తీర్మానమే ప్రవేశపెట్టింది.
అధికారంలోకి వచ్చాక..
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. జగన్ 2019 మే 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను కలిశారు. అనంతరం అక్కడ మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరాను. బీజేపీకి 250 సీట్లలోపే వచ్చి ఉంటే ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ వారికిప్పుడు మా అవసరం లేదు. మేం చేయాల్సింది చేశాం. ప్రధానికి చెప్పాల్సింది చెప్పాం’ అని అన్నారు. అంటే కేంద్రం హోదా ఇవ్వదని ఆనాడే చేతులెత్తేశారు. అదే ఏడాది జూన్‌లో హోదా, విశాఖకు రైల్వేజోన్ కోరుతూ అసెంబీలో తీర్మానం చేసి పంపించారు.
మరో సందర్భంలో ప్రధానిని కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘హోదాను మేం కోరుతూనే ఉంటాం’ అని చెప్పారు. ఇంతకు మించి కీలక హామీల అమలుకు కేంద్రంపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదు. కేవలం ఐదుగురు సభ్యులున్నప్పుడే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ.. ఇప్పుడు 22 మంది ఎంపీలున్నా ఏం చేస్తోంది? ఎక్కడ హోదా మంటలు రాజేస్తోంది? మూడు రాజధానుల బిల్లు తర్వాత కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుమతివ్వాలని కేంద్ర పెద్దలను కోరిన సీఎం.. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ గురించి గట్టిగా నిలదీశారా? కనీసం ఢిల్లీలో నిరసన తెలిపారా? నాడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం హోదాను తాకట్టుపెట్టారని ఆరోపించిన జగన్.. ఇప్పుడు ఎవరి మేలు కోసం కేంద్రంపై పోరాటం చేయకుండా మిన్నుకుండిపోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
విశాఖలో పాలనా రాజధాని ఉండాలని ప్రతిపాదించిన ప్రభుత్వ పెద్దలు.. ఆ నగరం కేంద్రంగా రైల్వేజోన్ తీసుకొచ్చేందుకు ఎందుకు సమరశీలంగా వ్యవహరించ లేదని నిలదీస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆమరణ దీక్ష చేసిన ఆయన సీఎంగా దీక్ష చేస్తే ఇంకా మేలు జరుగుతుందని రిటైర్డ్ అఖిల భారత సర్వీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్టుల్లోనూ అన్యాయమే!
ప్రత్యేక హోదా, రైల్వే జోన్ మాత్రమే కాదు.. కాకినాడలో ఏర్పాటు చేయాల్సిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు కూడా ఇదే గతి పట్టేటట్లు కనిపిస్తోంది. వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను రాష్ట్రప్రభుత్వం సర్దుబాటు చేస్తేనే కాంప్లెక్స్ ఏర్పాటు సాధ్యమని మోదీ సర్కారు స్పష్టం చేసింది. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని 2018లోనే నిలిపివేసింది. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్రం ఆమోదించిన ఇతర ప్రాజెక్టులూ ప్రభుత్వ నిర్లిప్తతతో పట్టాలు ఎక్కడం లేదు. సీమను రాజధాని అమరావతి రాజధానికి అనుసంధానించే అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే రహదారి ప్రాజెక్టును అటకెక్కించారు. అలాగే విజయవాడ నగరానికి ఎంతగానో ఉపకరించే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు సైతం మూలనపడింది.