రాజ్యాంగేతర శక్తిగా సజ్జల

ABN , First Publish Date - 2021-07-07T08:52:56+05:30 IST

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ...ముఖ్యమంత్రికే ప్రత్యామ్నాయంగా చలామణి అవుతున్నారని నరసాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు

రాజ్యాంగేతర శక్తిగా సజ్జల

మంత్రులను అవమానిస్తున్నారు.. ఎవరైనా పిల్‌ వేస్తే మీ ప్రతిష్ఠకే భంగం

ఆయన బాధ్యతల్ని స్పష్టం చేయండి: సీఎంకు రఘురామ 8వ లేఖ


న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ...ముఖ్యమంత్రికే ప్రత్యామ్నాయంగా చలామణి అవుతున్నారని నరసాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.  ‘నవ సూచనల’ పరంపరలో మంగళవారం ముఖ్యమంత్రికి రాసిన ఎనిమిదో లేఖలో సజ్జల వైఖరిపై రఘురామ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ముఖ్యమంత్రి మీడియాకు మొహం చాటేస్తుండటంతో సజ్జల ఏకంగా సీఎంకు ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తున్నారు. ఎవరో ఒకరు ప్రజాప్రయోజనాల వ్యాజ్యంతో న్యాయస్థానాల గడప తొక్కితే సీఎంగా మీ ప్రతిష్ఠకు భంగం కలగవచ్చు. ఒక వేళ సజ్జల అద్భుతమైన వ్యక్తి అని మీరు భావిస్తే, పెద్దల సభకు నామినేట్‌ చేయడమో, శాసనసభ టికెట్‌ కేటాయించి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించడమో చేయండి. ఆ తర్వాత ఆయనను మంత్రి మండలిలోకి తీసుకుని.. ప్రభుత్వ వ్యవహారాలపై వ్యాఖ్యానించే బాధ్యతను అప్పగించండి’’ అని ఆ లేఖలో సూచించారు. సజ్జల ప్రస్తుతం పోషిస్తున్న పాత్రపై ముఖ్యమంత్రిగా మీరు స్పష్టత ఇవ్వాలని ఆ లేఖలో రఘురామ కోరారు. కాగా.. తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జలజగడంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు రఘురామ లేఖ రాశారు. 

Updated Date - 2021-07-07T08:52:56+05:30 IST