రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు
ABN , First Publish Date - 2021-10-20T08:35:21+05:30 IST
టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆ పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో జాతీయరహదారిపై బోసుబొమ్మ కూడలి వద్ద టీడీపీ అరకు పార్లమెంటరీ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి అధ్వర్యంలో..

(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆ పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో జాతీయరహదారిపై బోసుబొమ్మ కూడలి వద్ద టీడీపీ అరకు పార్లమెంటరీ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి అధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ.భంజ్‌దేవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్‌లో ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. అనంతపురం జిల్లాకేంద్రంలో టీడీపీ శ్రేణులు టవర్‌క్లాక్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్‌లో టీడీపీ నిరసన
వైసీపీ శ్రేణుల దాడులను ఖండిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, సామా భూపాల్ రెడ్డి నిరసన తెలిపారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహించాలని నర్సింహులు పిలుపునిచ్చారు.