‘రెక్కీ’ వెనుక వైసీపీ పెద్దలు
ABN , First Publish Date - 2021-12-30T08:24:12+05:30 IST
‘‘బెజవాడలో మళ్లీ పాత రోజులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ దాడి చేశారు.

బెజవాడలో పాత రోజులు పునరావృతమయ్యే సూచనలు: బుద్దా వెంకన్న
విజయవాడ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘‘బెజవాడలో మళ్లీ పాత రోజులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ దాడి చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. అదే రోజు వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ ఘటనలన్నింటికీ ఏదో లింక్ ఉంది’’ అని తెలుగుదేశం పార్టీ నేత, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు చూసి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. ‘‘ఎవరి జోలికీ వెళ్లని వ్యక్తి వంగవీటి రాధా. ఆయనపై రెక్కీ నిర్వహించడం దారుణం. ఇది మామూలు విషయం కాదు. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. నిజాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. రాధాతో మా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు’’ అని వెంకన్న తెలిపారు.