Prakasam: భావనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం.. క్యూ కట్టిన భక్తులు

ABN , First Publish Date - 2021-10-04T12:28:40+05:30 IST

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలోని భూనీల సమేత భావన్నారాయణ స్వామి...

Prakasam: భావనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం.. క్యూ కట్టిన భక్తులు

ఒంగోలు/పెదగంజాం : ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలోని భూనీల సమేత భావనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. స్వామివారి గర్భగుడిలోని మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యం ఆదివారం ఉదయం 5.50 నుంచి 6.05 గంటల సమయంలో 15 నిమిషాలపాటు ఆవిష్కృతమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ అత్యద్భుతాన్ని భక్తులు తిలకించి తరించడానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. ప్రతి ఏడాది ఏప్రిల్, అక్టోబర్ మాసాల్లోని దక్షిణాయణ, ఉత్తరాయణ పుణ్యకాలాల్లో రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ను తాకుతాయి.


ఆ విధంగా దేవాలయాన్ని ఆగమ శాస్త్ర పండితులు వాస్తు, ఖగోళ శాస్త్రాలను సమ్మేళనం చేసి నిర్మించినట్లు అక్కడున్న రాతి శాసనాల ద్వారా తెలుస్తోంది. గాలి గోపురం నుంచి సుమారు 100మీటర్ల దూరంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న ముఖద్వారం నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామిని తాకడం ఇక్కడ విశేషం. అర్చకులు బృందావనం రాఘవాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వాతావరణం అనుకూలంగా ఉంటే బుధవారం వరకూ సూర్యకిరణాలు స్వామిని తాకుతాయని అర్చకులు తెలిపారు.

Updated Date - 2021-10-04T12:28:40+05:30 IST