ఆహా.. ఏమి చెప్పారు!

ABN , First Publish Date - 2021-12-30T08:14:27+05:30 IST

అమూల్‌కు ప్రచారం చేసిపెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ సంస్థ పాల కంటే ముఖ్యమంత్రిపై పొగడ్తలే ఎక్కువగా పొంగిపొర్లాయి.

ఆహా.. ఏమి చెప్పారు!

  • సీఎం దార్శనికతతోనే పాల ఉత్పత్తులు పెరిగాయట!
  • కమిట్‌మెంట్‌తో మాంసం వ్యాపారం పెంచారట!
  • నిర్వీర్యమైన వ్యవస్థలను జగన్‌ పునరుద్ధరించారట!
  • అమూల్‌ పాల కార్యక్రమంలో పొంగిపొర్లిన పొగడ్తలు
  • మంత్రి సీదిరి, ఐఏఎస్‌ పూనంపై నెటిజన్ల ట్రోలింగ్‌

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అమూల్‌కు ప్రచారం చేసిపెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ సంస్థ పాల కంటే ముఖ్యమంత్రిపై పొగడ్తలే ఎక్కువగా పొంగిపొర్లాయి. సీఎంను మెప్పించడానికి నేతల నుంచి అధికారుల వరకు హోదాలు మరిచి హడావుడి చేశారు. ముఖ్యమంత్రి దార్శనీకత, పట్టుదల, ముందు చూపు అంటూ సాగిన పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రసంగాన్ని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారి హోదాలో ఫక్తు రాజకీయ వ్యాఖ్యానం చేయడం ఏమిటంటూ ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తీరుకు ఆశ్చర్యపోతున్నారు. కృష్ణాజిల్లాలో  బుధవారం మొదలైన జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అప్పలరాజు ఏమన్నారంటే.. ‘‘కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో 2019లో పాలఉత్పత్తిలో వృద్ధి రేటు 1.4%. ముఖ్యమంత్రి ముందుచూపు, దార్శనికత, పట్టుదల కారణంగా ఈరోజున ఏపీ పాల ఉత్పత్తి రేటు 11.7% కు చేరుకుంది. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో గ్రోత్‌ అండ్‌ ఎకానమి అనే లక్ష్యంతో పని చేయడం వల్ల ఇది సాధ్యమైంది. మాంస ఉత్పత్తుల్లో 2019లో 6.7% వృద్ధి రేటు ఉంది.  సీఎం పట్టుదల, కమిట్‌మెంట్‌ కారణంగా ఇప్పుడది 10.3%కు చేరుకుంది. అమూల్‌ ప్రాజెక్టుల ద్వారా ఇతర డెయిరీల కంటే పాడి రైతులకు ఇస్తున్న రేటు ఎక్కువగానే ఉంది. 


మహిళా సాధికారతను సాధించడంలో జగనన్న పాల వెల్లువ పథకం పూర్తి విజయం సాధించింది’’’ అని మంత్రి అన్నారు. పాలు, మాంసం ఉత్పత్తులు పెరగడానికీ సీఎం దార్శనికతకు, కమిట్‌మెంట్‌కు ఏం సంబంధమని నెటిజన్లు విస్తుపోతున్నారు. కాగా, పశుసంవర్ధకశాఖ తొలిసమీక్షలో పాల ఉత్పత్తిపై సీఎంతో జరిగిన చర్చను ఈ కార్యక్రమంలో పూనం మాలకొండయ్య పంచుకున్నారు. అంతవరకు ఫరవాలేదు. కానీ, పాల ఉత్పత్తులు పెంచడానికి గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..‘‘ పాల ఉత్పత్తి ఎలా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అడిగారు. మేం ఎంతో గొప్పగా ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని, 154లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పాం. మరి..పాడి రైతులకు వస్తున్న ధరలో దేశంలో ఏపీ ఏ స్థానంలో ఉందని సీఎం అడిగారు. ఈ విషయంలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందని మెల్లగా చెప్పాం. ఎందుకని సీఎం అడగారు.. మేమేమి చెప్తాం.. మీకన్నీ తెలుసు అని సమాధానమిచ్చాను. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన పాడి సంఘాలు, చిన్నాభిన్నమైన పాడి రైతుల బతుకును బాగు చేయడానికి తీసుకున్న నిర్ణయమే జగనన్న పాలు వెల్లువ. పాడి రైతుల స్వావలంబన, ఆర్ధిక పరిపుష్టికి సీఎం తీసుకున్న నిర్ణయమిది. సుదీర్ఘపాదయాత్రలో పాడి రైతుల కష్టాన్ని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి...అధికారంలోకి రాగానే నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే నిర్వీర్యమైన పాల సంఘాల పునరుద్ధరణకు అనేక చర్యలు చేపట్టారు’’ అని పూనం వివరించారు. 

Updated Date - 2021-12-30T08:14:27+05:30 IST