మా నిధులు వెనక్కిచ్చేయండి
ABN , First Publish Date - 2021-11-26T09:18:12+05:30 IST
మా నిధులు వెనక్కిచ్చేయండి

సర్పంచ్ల డిమాండ్... నిరసన ప్రదర్శనలు
నిధుల మళ్లింపు రాజ్యాంగ విరుద్ధం
తక్షణమే జమచేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన
కర్నూలు కలెక్టరేట్, జగ్గయ్యపేట రూరల్, నవంబరు 25: గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ సర్పంచులు ఆందోళనకు దిగారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో భిక్షాటన చేశారు. సర్పంచుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.3,500 కోట్ల నిధులను తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల సంఘం నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పంచాయతీల తీర్మానాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నిధులను వెంటనే జమ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతా్‌పరెడ్డి హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో టీడీపీ సర్పంచ్‌లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. సర్పంచ్‌లు గ్రామంలో భిక్షాటన చేసి ఎన్టీఆర్, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.