కరోనా సవాళ్లను ఎదుర్కొందాం!

ABN , First Publish Date - 2021-04-21T09:45:03+05:30 IST

కరోనా విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు యూనివర్సిటీల వైస్‌ చాన్సెలర్‌(వీసీ)ల నుంచి విద్యార్థుల వరకు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కరోనా పరిస్థితులపై ఆయన మంగళవారం విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి ఆయా వర్సిటీల వీసీలతో వెబ్‌నార్‌ సమావేశాన్ని నిర్వహించారు.

కరోనా సవాళ్లను ఎదుర్కొందాం!

  • -వీసీ నుంచి విద్యార్థి వరకు భాగస్వామ్యం 
  • -‘రెడ్‌క్రాస్‌ యాప్‌’ ద్వారా అవగాహన పెంచండి
  • -విద్యార్థులు ఇంటింటా ప్రచారం చేయాలి
  • -గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దిశానిర్దేశం


అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కరోనా విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు యూనివర్సిటీల వైస్‌ చాన్సెలర్‌(వీసీ)ల నుంచి విద్యార్థుల వరకు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కరోనా పరిస్థితులపై ఆయన మంగళవారం విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి ఆయా వర్సిటీల వీసీలతో వెబ్‌నార్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీల్లో తీసుకుంటున్న ముందస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంరతం ఆయన మాట్లాడుతూ.. కంటికి కనిపించని శత్రువుపై అందరూ ఐక్యంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే వైరస్‌ గొలుసును విచ్ఛిన్నం చేయగలుగుతామన్నారు. రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యాసంస్థల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వీసీలకు సూచించారు.


ఉన్నత విద్యాసంస్థలు ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండాలని, కరోనాపై వారిలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమను తాము కాపాడుకుంటూ అటు కుటుంబానికి ఇటు సమాజానికి మధ్య దూతలుగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణకు ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎస్‌ బృందాల సహకారం తీసుకోవాలన్నారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఈ నెల 8, 14 తేదీల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారని.. పరీక్షలు, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, ప్రవర్తనా నియమావళి అమలు, టీకా అనే ఐదు అంశాల వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికే రెడ్‌క్రాస్‌ ప్రతినిఽఽధులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలకు ఆదేశాలు జారీచేశామని, ఆయా జిల్లా యంత్రాంగాలతో రెడ్‌క్రాస్‌ యూనిట్లు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లోని ప్రతి విద్యార్థి ‘రెడ్‌క్రాస్‌ మొబైల్‌ యాప్‌’ ద్వారా తగిన ప్రచారాన్ని చేపట్టాలన్నారు. 


రోజుకు 5 ఇళ్లకు వెళ్లండి!

విద్యార్థులు ప్రతి రోజు కనీసం ఐదు ఇళ్లకు వెళ్లి ‘రెడ్‌క్రాస్‌ యాప్‌’ ద్వారా అవగాహన కల్పించాలని, సామాజిక నిఘా ద్వారా కరోనా చర్యలపై దృష్టి పెట్టాలని గవర్నర్‌ సూచించారు. సామాజిక నిఘా విభాగంలో విద్యార్థుల పాత్రకు సంబంధించి రాజ్‌భవన్‌ వారిని ప్రత్యేకంగా అభినందిస్తుందని, ప్రతి జిల్లాలో 10 ఉత్తమ కళాశాలలు, రాష్ట్రంలోని 3 ఉత్తమ విశ్వవిద్యాలయాలను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు యోగా, సాధారణ చిట్కాలను పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వారు వెంటనే వైద్య సహాయం తీసుకునేలా విద్యార్థులు సహకరించాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ.. కరోనాపై విద్యార్థుల ప్రచార ఉద్యమానికి రెడ్‌క్రాస్‌ తగిన తోడ్పాటును అందించాలని ఆకాంక్షించారు. అకడమిక్‌ కేలండర్‌ మేరకే కార్యక్రమాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని వీసీలకు సూచించారు. ఈ సందర్భంగా వీసీలు తాము చేపట్టబోతున్న చర్యలను  గవర్నర్‌కు వివరించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సతీశ్‌చంద్ర, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి ముఖేష్‌ మీనా పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T09:45:03+05:30 IST