తెల్ల బంగారం అ‘ధర’హో

ABN , First Publish Date - 2021-12-28T07:58:26+05:30 IST

తెల్లబంగారంగా భావించే పత్తి ధర గణనీయంగా పెరిగింది. క్వింటా రూ.9 వేలు దాటింది. రాష్ట్రంలో కనీస మద్దతు ధరను మించి 50ు అదనంగా ధర లభిస్తోంది.

తెల్ల బంగారం అ‘ధర’హో

  • కనీస మద్దతుకు 50% అదనం
  • క్వింటా 9 వేలు దాటిన పత్తి ధర
  • సంక్రాంతి నాటికి రూ.10 వేలకు చేరిక
  • హర్షం వ్యక్తం చేస్తున్న పత్తి రైతులు
  • ఇతర రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంట 
  • దీంతో మన దగ్గర దిగుబడికి డిమాండ్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : తెల్లబంగారంగా భావించే పత్తి ధర గణనీయంగా పెరిగింది. క్వింటా రూ.9 వేలు దాటింది. రాష్ట్రంలో కనీస మద్దతు ధరను మించి 50ు అదనంగా ధర లభిస్తోంది. అక్టోబరు మొదట్లో క్వింటా రూ.6 వేలు ఉన్న పత్తి.. క్రమంగా పెరిగింది.  నెలరోజుల్లోనే కనీస మద్దతు ధరను మించి రూ.8 వేలకు చేరింది. నవంబరు మొదటి వారంలో రూ.9 వేలకు దగ్గరగా ధర ఉండగా, వరుస తుఫాన్లతో పంట దెబ్బతినడంతో ధర తగ్గిపోయింది. అయితే మద్దతు ధర కంటే ఏ మాత్రం తగ్గలేదు. కనిష్ఠ ధర కూడా రూ.5 వేలకు తగ్గలేదు. ఈ నెలలో రూ.8 వేలతో మొదలై ఇప్పుడు రూ.9 వేలు దాటింది. సోమవారం కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి రూ.9.049 పలికింది. ఈ ఏడాది పొడుగు పింజ పత్తికి క్వింటాకు రూ.6,025, మధ్యస్థ పింజ పత్తికి రూ.5,726గా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల్ని ప్రకటించింది. కానీ, ఎమ్మెస్పీకి మించి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తుండటంతో రైతులు స్థానికంగానే పత్తిని విక్రయిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తి తెచ్చే అవసరం లేకుండా పోయింది. 


గ్రామాల్లోనే కొనుగోలు

నాణ్యమైన పత్తికి ప్రైవేట్‌ వ్యాపారులు రూ.8 వేల దాకా ఇచ్చి గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలోనూ దాదాపు ఇంతే ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతులు ఎక్కడికక్కడ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 13.5 లక్షల ఎకరాల్లోపత్తి సాగు చేయగా, ఎకరానికి ఏడున్నర క్వింటాళ్ల చొప్పున దాదాపు కోటి క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పత్తి పూత, కాయ దశలోనే పాడైపోయి దిగుబడి కొంత మేరకు తగ్గింది. అలాగే మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లోనూ వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో పత్తికి భారీ డిమాండ్‌ వచ్చింది. మెరక పొలాల్లో పంట బాగా పండిన ప్రాంతాల రైతులు ఇప్పటికే రెండు, మూడు విడతలుగా ఆరేడు క్వింటాళ్ల పత్తిని తీసి విక్రయించారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో నాలుగైదు క్వింటాళ్ల పత్తిని తీయగా, మరో ఒకటీ, రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


రైతన్నల హర్షం

సంక్రాంతి నాటికి 80ు పంట అయిపోతుందని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగుకు ఎకరానికి రూ.50 వేల దాకా పెట్టుబడి పెట్టగా, దిగుబడి 7 క్వింటాళ్లు వచ్చి సగటున రూ.7 వేల చొప్పున అమ్మితే, పెట్టుబడులు దక్కే అవకాశం ఉంది. ఈ ప్రకారం పత్తి ప్రైవేట్‌ మార్కెట్‌లో ఆశాజనకంగా ఉండటం ఎక్కువ మంది రైతులు ఈ దఫా నష్టాల నుంచి బయటపడినట్టేనని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు పత్తి క్వింటా రూ.10 వేలు దాటే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-12-28T07:58:26+05:30 IST