రుయా మృతుల జాబితా ఏదీ?

ABN , First Publish Date - 2021-05-13T08:22:19+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా ఆగిన ఘటనలో మృతిచెందిన కొవిడ్‌ బాధితుల వివరాలతో కూడిన జాబితా ఇంకా విడుదల కాలేదు

రుయా మృతుల జాబితా ఏదీ?

48 గంటలు దాటుతున్నాఎదురుచూపులే 

చనిపోయిన టైంతో డెత్‌ డిక్లరేషన్‌ 

సాంకేతికంగా ఇరుక్కున్న రుయా! 

సర్దుబాటుపై మల్లగుల్లాలు

11మంది మృతుల పేర్లతో ఓ జాబితా చక్కర్లు 

ఆక్సిజన్‌ సరఫరా, వినియోగంపై విజి‘లెన్స్‌’ ఇండెంట్‌ రిజిస్టరే లేదని గుర్తింపు?


తిరుపతి, మే 12(ఆంధ్రజ్యోతి): తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా ఆగిన ఘటనలో మృతిచెందిన కొవిడ్‌ బాధితుల వివరాలతో కూడిన జాబితా ఇంకా విడుదల కాలేదు. ఈ దుర్ఘటన జరిగి 48గంటలు దాటుతున్నా జిల్లా యంత్రాంగం మృతు ల వివరాలు ప్రకటించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. గత సోమవారం రాత్రి రుయాలో ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయిన కారణంగా 11మంది కొవి డ్‌ బాధితులు చనిపోయారని కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆ రోజే ప్రకటించారు. అయితే వారు ఎవరన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ రోజు రుయాలో 56మంది చనిపోయారని ఆస్పత్రి సూపరింటెండెంటే స్పష్టం చేశారు. కొవిడ్‌ బాధితుల మరణానికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు జారీచేసే డెత్‌ డిక్లరేషన్‌లో మరణ సమయం కూడా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంలోనే చిక్కులు ఎదురైనట్లు సమాచారం. ఆక్సిజన్‌ సరఫరా ఆగిన వ్యవధిలో కలెక్టర్‌ చెప్పిన 11మంది కాకుండా మరికొంత మంది కూడా మరణించినట్టు డెత్‌ డిక్లరేషన్లు వెల్లడిస్తున్నాయని సమాచారం. సరిగ్గా ఇక్కడే సాంకేతికంగా ఇరుక్కున్నట్టు భావిస్తున్న అధికారులు దాన్నెలా సర్దుబాటు చేసుకోవాలో తెలియకే రెండు రోజులవుతున్నా మృతుల జాబితా ప్రకటించలేదని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కలెక్టర్‌ ప్రకటించిన 11మంది మృతుల పేర్లతో కూడిన ఓ జాబితా మీడియా, రాజకీయ వర్గాల్లో సర్క్యులేట్‌ అవుతోంది. ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన నేపథ్యంలో ఆ జాబితాలో తమవారి పేరు లేదని చాలామంది మృతుల కుటుంబీకులు వేదనకు లోనవుతున్నారు. 


ఇద్దరు అధికారులకు మెమో

రుయా ఆస్పత్రి నిర్వహణలో కీలక పాత్ర వహించే ముఖ్య అధికారులు ఇద్దరికి కలెక్టర్‌ మెమోలు జారీ చేసినట్టు తెలిసింది. ఆక్సిజన్‌ సరఫరా ఆగిన ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? ప్లాంట్‌ నిర్వహణ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? నిల్వల స్థాయి పర్యవేక్షణ, అవసరమైన ఆక్సిజన్‌ తెప్పించుకోవడం వంటి అంశాలకు సంబంధించి జరిగిందేమిటి? ఘటనకు కారకులెవరు? అనే విషయాలపై సమగ్ర వివరణ ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించినట్టు సమాచారం.


విజిలెన్స్‌ విచారణ 

రుయాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్వహణకు సంబంధించి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, వినియోగం తదితర అంశాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు బుధవారం విచారణ నిర్వహించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఇండెంట్‌ రిజిస్టరే లేదని గుర్తించినట్టు సమాచారం. ఆక్సిజన్‌ ప్లాంట్‌లో తేదీల వారీ నిల్వ ఎంత ఉంది? ఎప్పుడు, ఎంత అవసరం? ఏ తేదీకి ఎంత పరిమాణంలో వచ్చింది? రోజువారీ వినియోగిస్తున్న పరిమాణం వంటి వివరాలు ఇండెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇండెంట్‌ రిజిస్టర్‌ లేకుండా ఆక్సిజన్‌ సరఫరాదారులకు బిల్లులు ఏ ప్రాతిపదికన చెల్లించారనే ప్రశ్న తలెత్తుతోంది. 


మృతులు 23మంది: సీపీఐ నారాయణ

రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా ఆగిన ఘటనలో ప్రభుత్వం మృతుల విషయంలో కూడా అసత్యాలు ఆడుతోందంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మాట్లాడుతూ రుయా ఘటనలో 23మంది చనిపోతే కలెక్టర్‌ 11మంది మాత్రమే మరణించారని ప్రకటించడం నిజాలను కప్పిపుచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం 23మంది మృతుల జాబితాను విడుదల చేశారు. 


దాపరికంలో మతలబేంటి: బీజేపీ 

రుయా ఆస్పత్రి ఘటనలో మృతి చెందిన కొవిడ్‌ బాధితులందరికీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆ ఘటనలోనే చనిపోయిన తమ పార్టీ నేత రామారావు పేరు జాబితాలో లేదన్నారు. మృతులందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-13T08:22:19+05:30 IST