‘పంచాయతీలు’ ఎక్కడ?
ABN , First Publish Date - 2021-01-28T08:10:21+05:30 IST
అనేక మలుపులు, ఉత్కంఠ పరిణామాల తర్వాత ఎట్టకేలకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు తెర లేచింది. బాగానే ఉంది! అయితే..
రాష్ట్రమంతా సచివాలయాలే!
పంచాయతీల పేర్లు మాయం
కలికిరి, జనవరి 27: అనేక మలుపులు, ఉత్కంఠ పరిణామాల తర్వాత ఎట్టకేలకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు తెర లేచింది. బాగానే ఉంది! అయితే... రాష్ట్రంలో ‘పంచాయతీలు’ ఉన్నాయా అనే వింత సందేహం తలెత్తుతోంది. ఎందుకంటే... గ్రామ పంచాయతీ పేరు పోయి ‘గ్రామ సచివాలయం’ వచ్చేసింది. గ్రామ పంచాయతీ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైంది. కానీ... అసెంబ్లీలో చట్టం ద్వారా పుట్టి ‘సచివాలయం’... పంచాయతీ పేరును మింగేసింది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం కాగితాలపై మాత్రమే గ్రామ పంచాయతీల పేర్లను ప్రస్తావిస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. మహాత్మా గాంధీ బొమ్మ ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయాల పేర్లను తొలగించి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో సచివాలయ బోర్డులను తగిలించారు. వాటికి వైసీపీ రంగులూ పులిమి... కోర్టు ఆదేశాల నేపథ్యంలో తొలగించారు. ఇప్పటికీ... పలు గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులే ఉన్నాయి.