బెయిలు నేతలు జైలుకు వెళ్లేదెప్పుడో!

ABN , First Publish Date - 2021-12-30T08:46:17+05:30 IST

బెయిల్‌పై ఉన్న నేతల గురించి కేంద్రమంత్రులు మాట్లాడటం సంతోషం.

బెయిలు నేతలు జైలుకు వెళ్లేదెప్పుడో!

కేంద్ర మంత్రులు చెపితే ప్రజలు సంతోషిస్తారు: వర్ల రామయ్య

‘‘బెయిల్‌పై ఉన్న నేతల గురించి కేంద్రమంత్రులు మాట్లాడటం సంతోషం. అదే ఊపుతో అటువంటి నేతలు జైలుకు ఎప్పుడు వెళ్తారో కూడా చెబితే ప్రజలు సంతోషిస్తారు’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘రూ.43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సీబీఐ నిర్థారించి రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, అధికారులపై కేసులు పెట్టింది. అనేక మంది 16 నెలలపాటు జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఉన్నత పదవులు అలంకరించారు. ప్రజాప్రతినిధుల అవినీతి కేసుల్లో విచారణను ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ ఏడాది ఎప్పటికి పూర్తవుతుంది? ఆ విషయం ప్రధాని మర్చిపోయారా? రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్‌ పట్టిందని... దానికి మందు ప్రధాని వద్ద ఉందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వైరస్‌ పట్టినట్లు నిర్థారణ అయితే ఆ మందును ఎప్పుడు ప్రయోగిస్తారు? రాష్ట్రం సర్వనాశనం అయ్యేవరకూ వైర స్‌ను నిర్మూలించరా?’’ అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నా గవర్నర్‌ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రోజూ రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నా మౌన ముద్ర వీడటం లేదు. దీనికి కారణం ఏమిటి?’’ అని వర్ల ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-30T08:46:17+05:30 IST