వ్యవసాయానికి 11 గంటల విద్యుత్ హామీ ఏమైంది?
ABN , First Publish Date - 2021-01-20T08:47:15+05:30 IST
అధికారంలోకి వస్తే వ్యవసాయానికి రోజుకు 11 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పిన వైసీపీ...ఇప్పుడు తొమ్మిది గంటలే ఇస్తోందని, హామీని అమలు చేయరా? అంటూ పలువురు ప్రశ్నించారు.

ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రశ్నించిన ప్రతినిధులు
విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వస్తే వ్యవసాయానికి రోజుకు 11 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పిన వైసీపీ...ఇప్పుడు తొమ్మిది గంటలే ఇస్తోందని, హామీని అమలు చేయరా? అంటూ పలువురు ప్రశ్నించారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నారని, ఇక్కడ పరిమితంగా ఇస్తున్నారని కొందరు ఆరోపించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన టారి్‌ఫలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు మంగళవారం కూడా విశాఖపట్నంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 22 మంది నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక ప్రతినిధి మాట్లాడుతూ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం తగదన్నారు. అవి రైతుల మెడపై వేలాడే కత్తులని ఆందోళన వ్యక్తంచేశారు.