ఏమిటీ అలక్ష్యం?

ABN , First Publish Date - 2021-02-01T07:50:21+05:30 IST

ఎన్నికల సమయంలో రెండు జిల్లాల కలెక్టర్ల నియామకానికి తాము చేసిన సూచనలపై రాష్ట్రప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తప్పుబట్టారు.

ఏమిటీ అలక్ష్యం?

  • కలెక్టర్ల నియామక ప్రతిపాదనలను సవరించకుండా పంపుతారా?
  • ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తప్పించాలన్నందుకు ప్రతీకారమా?
  • గుంటూరు, చిత్తూరు కలెక్టర్లుగా బసంత్‌కుమార్‌, హరినారాయణ్‌
  • వీరిద్దరినీ నియమించండి.. ప్రధాన కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ


అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో రెండు జిల్లాల కలెక్టర్ల నియామకానికి తాము చేసిన సూచనలపై రాష్ట్రప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తప్పుబట్టారు. ఈ నియామకాలకు సాధారణ పరిపాలన విభాగం  ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలకు ఎం.హరినారాయణ్‌, పి.బసంత్‌కుమార్‌ను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులివ్వాలంటూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆదివారం లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించడంపై త్వరలో కోర్టుకు విన్నవిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ సూచించినా.. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల నియామకంపై తొలుత సమర్పించిన ప్రతిపాదనలనే తిప్పిపంపిందని, సవరించనే లేదని లేఖలో ఆక్షేపించారు. పైగా ప్యానెళ్లలో ప్రతిపాదించిన నలుగురు అధికారుల పేర్లు కూడా కనిపించడం లేదని.. చివరి నిమిషంలో వాటిని మార్చినట్లు కనిపిస్తోందని అన్నారు. ఎస్‌ఈసీ విషయంలో సర్కారు నిర్లక్ష్య వైఖరికి ఇది సూచికగా పేర్కొన్నారు. ఎస్‌ఈసీకి పూర్తి సహకారం అందిస్తామని నాటి సీఎస్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారని గుర్తుచేశారు. ‘ప్రస్తుత ఎన్నికల తరుణంలో చిత్తూరు, గుంటూరులకు కలెక్టర్లు లేకుండా పోయారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైనా ఉంది. 


పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గానీ, రాష్ట్ర ఎన్నికల అథారిటీ అయిన ఆ శాఖ కమిషనర్‌ గానీ కనీసం మర్యాదకైనా ఎస్‌ఈసీ కార్యాలయానికి రాలేదు. జనవరి 27న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎ్‌సతో పాటు కలిసి కాసేపు వచ్చి వెళ్లారంతే! కలెక్టర్ల నియామకానికి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని ఎస్‌ఈసీ జనవరి 28, 30వ తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వులకు ప్రతీకారంగానే అడ్డుకున్నట్లు నిర్ధారణకు వచ్చాం’ అని నిమ్మగడ్డ తెలిపారు. తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై త్వరలోనే హైకోర్టులో విచారణ జరగనుందని.. ఆ సందర్భంగా ఈ వివరాలన్నీ కోర్టుకు నివేదిస్తామని.. ఇది తప్ప తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. బదిలీ అయిన ఏడుగురు పోలీసు అధికారుల స్థానంలో నియామకానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ఎస్‌ఈసీ సూచనలకు అనుగుణంగా సముచిత ప్రతిపాదనలు పంపారని ప్రశంసించారు. ఆయా పోలీసు అధికారుల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా లేవన్నారు. కలెక్టర్ల నియామకంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో ఈ వివేకం పూర్తిగా లోపించిందని, గత ప్రతిపాదనను యాంత్రికంగా మరోసారి పంపిందని వ్యాఖ్యానించారు. గుంటూరు కలెక్టర్‌గా పి.బసంత్‌కుమార్‌, చిత్తూరుకు ఎం.హరినారాయణ్‌ను నియమించాలని సీఎ్‌సకు సూచించారు. గుంటూరుకు హరినారాయణ్‌ను.. చిత్తూరుకు బసంత్‌కుమార్‌ను నియమించుకోవచ్చని కూడా తెలియజేశారు.


ఇంకా నిర్ణయం తీసుకోలేదు: దాస్‌

తాము పంపిన ప్యానెళ్లలోని పేర్లు కాకుండా.. సొంతంగా ఇద్దరిని నియమిస్తూ ఎస్‌ఈసీ చేసిన సిఫారసుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటుందని కమిషనర్‌కు లేఖ రాశారు. ఇదే సమయంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేయబోమని స్పష్టం చేశారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన.. జీఎడీ బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్నారని.. ఈ రెండు విభాగాలూ ఎస్‌ఈసీ పరిధిలోకి రావని.. అందువల్ల ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించేందుకు ఆస్కారం లేదని సీఎస్‌ స్పష్టం చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


ఎన్నికల సంఘం పవర్‌ ఇదీ..

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘానికి తిరుగులేని అధికారాలు ఉంటాయి. ముఖ్యంగా అధికారుల నియామకాలకు సంబంధించి దాని మాటకు తిరుగులేదు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను నియమిస్తూ ఎస్‌ఈసీ స్వయంగా నిర్ణయంగా తీసుకోవడం కొత్తదేం కాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. కోడ్‌ ఉల్లంఘించారని 2006లో విశాఖ కలెక్టర్‌గా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఎన్నికల సంఘం బదిలీచేసింది. అదే సమయంలో మరో సంఘటన జరిగింది. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు తన దృష్టికి తీసుకురానందుకు నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎం.నారాయణరావును ఈసీ బదిలీ చేసింది.


ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను పంపాలని వైఎస్‌ సర్కారును ఆదేశించింది. అయితే నారాయణరావును వదులుకోవడం ఇష్టం లేని ప్రభుత్వం.. ప్యానెల్‌ పంపడానికి తొలుత తటపటాయించినా ఈసీకి ఉన్న అధికారాల దృష్ట్యా ముగ్గురు అధికారులతో జాబితాను పంపించింది. అయితే వీరెవరూ సరైనవారు కాదని ఈసీ భావించింది. మరో జాబితా పంపాలని ఆదేశించింది. ప్రభుత్వం జాప్యం చేయడంతో తానే ఐఏఎస్‌ అధికారి వెంకటరమణి భాస్కర్‌ పేరు సూచించింది. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు జోడించి ప్యానెల్‌ పంపాలని నిర్దేశించింది. సర్కారు తర్జనభర్జన పడినా.. ఎన్నికల సంఘం అధికారాలు తిరుగులేనివని గ్రహించి.. భాస్కర్‌తో పాటు ఇంకో ఇద్దరు అధికారుల పేర్లను పంపింది. సీఈవోగా భాస్కర్‌ను ఈసీ నియమించింది.

Updated Date - 2021-02-01T07:50:21+05:30 IST