కొవిడ్‌ సంక్షోభంలోనూ సంక్షేమం

ABN , First Publish Date - 2021-05-21T09:58:03+05:30 IST

కొవిడ్‌ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు

కొవిడ్‌ సంక్షోభంలోనూ సంక్షేమం

జాతీయ వృద్ధిరేటు మైన్‌సలోకి...రాష్ట్రంలో మాత్రం 1.5%

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం 


అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. అమ్మ ఒడి నుంచి రైతు భరోసా వరకు... నవరత్నాల్లో హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వృద్ధిరేటు మైనస్‌ 3.8 శాతం ఉండగా రాష్ట్రంలో మాత్రం 1.58 శాతం సానుకూల వృద్ధి రేటు ఉందన్నారు. రాష్ట్రంలో 45ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్‌ కోసం టీకాలు కొనుగోలు చేశామన్నారు. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువగా కొవిడ్‌ పరీక్షలు చేశామన్నారు. గురువారం రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్‌ రాజ్‌భవన్‌ నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు. 


‘‘కొవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయి. 2020 మార్చి నాటికి ఒక్క టెస్టింగ్‌ ల్యాబ్‌ కూడా లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం ఉప-జిల్లా స్థాయిలో కూడా ల్యాబ్‌లు ఉండేలా చేయగలిగాం. 46,056 బెడ్లతో 632 కొవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. 18,270 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించాం. కరోనా పరీక్షల జాతీయ సగటు 2.2లక్షలు ఉండగా రాష్ట్రంలో 3.3 లక్షల మందికి చేశాం. ఆస్పత్రుల్లో సగం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాం. వ్యాక్సిన్‌ మొదటి డోసు 53.28లక్షల మందికి, రెండోడోసు 21.64లక్షల మందికి వేశాం. రాష్ట్రంలో తలసరి ఆదాయం 1.03 శాతం పెరిగి రూ.1,68,480 నుంచి రూ.1,70,215కు చేరింది. సంక్షేమ పథకాలకు సంబంధించి 2020-21 సంక్షేమ కేలండర్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అమ్మ ఒడి కింద 44.5 లక్షల మంది తల్లులకు ఇప్పటివరకు రూ.13,022 కోట్లు అందించాం. జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, గోరుముద్ద కింద సాయం చేశాం. విద్యార్థుల ప్రమాణాలు పెంచేందుకు ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టాం.  


రైతులకు రూ.68వేల కోట్లు సాయం 

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 28.81 లక్షల మందికి నివాస స్థలాలిచ్చాం. జగనన్న కాలనీల కింద 30.9లక్షల ఇళ్లను రెండు దశ ల్లో నిర్మించబోతున్నాం. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటి వరకు 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.17,030కోట్లు అందించాం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,100 కోట్లు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు పలు పథకాల కింద రూ.68 వేల కోట్లు సాయం చేశాం. దళిత పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్‌ బడుగు వికాసం కింద పలు ప్రోత్సాహకాలు ప్రకటించాం. వైఎస్సార్‌ నవోదయం కింద ఎంఎ్‌సఎంఈల రుణాలన్నీ వన్‌టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌ చేశాం. పారిశ్రామికాభివృద్ధి కోసం పోర్టు ఆధారిత అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నాం. జలయజ్ఞం కింద చేపట్టిన 54 ప్రాజెక్టుల్లో 15 పూర్తయ్యాయి. అవినీతి లేని పాలన కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశాం. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు, అలసిపోకుండా చేస్తోంది. మొక్కవోని దీక్షతో చేసే ఈ మిషన్‌కు మహాత్మాగాంధీ ఆలోచనల నుంచి స్ఫూర్తిని తీసుకుంటోంది. ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు కొనసాగిస్తారని ఆశిస్తూ, కొవిడ్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ.. జైహింద్‌...’’ అంటూ గవర్నర్‌ ప్రసంగాన్ని ముగించారు.


రూపాయి రాక

  • రాష్ట్ర పన్నులు - సుంకాలు 48.1
  • కేంద్ర పన్నుల్లో వాటా 15.2
  • ఇతర పన్నేతర ఆదాయం 36.6
  • వడ్డీ ఆదాయం 0.1


రూపాయి పోక

  • అభివృద్ధి వ్యయం 71.3
  • వడ్డీ చెల్లింపులు 13.1
  • పరిపాలనా వ్యయం 5.9
  • పన్ను వసూళ్ల వ్యయం 0.6
  • ఇతరత్రావ్యయం 11.9
  • లోటు (-)2.8

Updated Date - 2021-05-21T09:58:03+05:30 IST