బకాయిలను జూన్ కల్లా చెల్లిస్తాం
ABN , First Publish Date - 2021-12-30T08:00:57+05:30 IST
ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు(మూడు, నాలుగు క్వార్టర్లు) వరకు పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను వచ్చే ఏడాది జూన్ నెలనాటికి రెండు దఫాలుగా చెల్లిస్తామని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హైకోర్టుకు తెలిపింది.

- మూడు, నాలుగు క్వార్టర్ల నిధులపై హైకోర్టుకు విద్యుత్ పంపిణీ సంస్థల నివేదన
- అంత గడువు కుదరదన్న ఉత్పత్తి సంస్థలు
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు(మూడు, నాలుగు క్వార్టర్లు) వరకు పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను వచ్చే ఏడాది జూన్ నెలనాటికి రెండు దఫాలుగా చెల్లిస్తామని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఉత్పత్తి సంస్థలను హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాలపై త్వరగా విచారించాలన్న ఉత్పత్తి సంస్థల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించింది. జనవరి 17, 18న రెండు రోజుల పాటు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. విచారణను జనవరి 17కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. బుధవారం జరిగిన విచారణలో విద్యుత్ పంపిణీ సంస్థల తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ ఏడాది జూన్ నెల బకాయిలు చెల్లించామన్నారు. మూడవ క్వార్టర్ బకాయిలను మార్చి 2022 నాటికి, అలాగే నాలుగవ క్వార్టర్ బకాయి జూన్ 2022కి చెల్లిస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, సంజయ్‌పూవయ్య వాదనలు వినిపించారు. మూడు, నాలుగు క్వార్టర్ల బకాయిలు చెల్లింపులకు ప్రభుత్వం విధించిన గడువు ఆమోదయోగ్యంగా లేదన్నారు. గడువును తగ్గించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వ్యాజ్యాల పై అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది.