అఫిడవిట్‌ వేస్తాం!

ABN , First Publish Date - 2021-07-15T07:36:59+05:30 IST

అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ మనసు మార్చుకుంది

అఫిడవిట్‌ వేస్తాం!

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌లో లిఖితపూర్వక వాదనకు సీబీఐ ఓకే

10 రోజులు గడువివ్వాలని ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి

రఘురామ లాయర్ల అభ్యంతరం.. కాలయాపనకేనని ఆరోపణ

తదుపరి విచారణ 26కు వాయిదా


హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ మనసు మార్చుకుంది. గత విచారణ సందర్భంగా తాము దాఖలు చేసిన మెమోనే లిఖితపూర్వక వాదనలుగా భావించాలని కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు లిఖితపూర్వక వాదనలు అందిస్తామని.. ఇందుకు 10 రోజులు గడువివ్వాలని ప్రత్యేక కోర్టును బుధవారం అభ్యర్థించింది. దీనిపై రఘురామరాజు తరఫు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. విచారణ జరగకుండా కాలయాపన చేయడం కోసమే ఇటువంటి అభ్యర్థన చేస్తోందని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీఆర్‌ మధుసూదనరావు తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.


జగన్‌ అక్రమాస్తుల కేసులు 22కు వాయిదా

జగన్‌ అక్రమాస్తుల కేసులపై విచారణ మరోసారి వాయిదాపడింది. ఇందూ టెక్‌జోన్‌ కేసులో సీబీఐ చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. తాము కూడా డిశ్చార్జి పిటిషన్లు వేస్తామని, విచారణ వాయిదా వేయాలని ఇదే కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, మరికొందరి తరఫు లాయర్లు కోరారు. ఈ కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి, భూమి రియల్‌ ఎస్టే సంస్థ, కార్మల్‌ ఏసియా సంస్థలు కూడా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశాయి. తాము డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయబోమని ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చార్జిషీటుపై తమ వాదనలు వినిపిస్తామన్నారు. దీంతో ఈ వ్యాజ్యాల విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.  ఓబుళాపురం మైనింగ్‌ కేసు విచారణను ఈనెల 19కి, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసుని ఈ నెల 28కి వాయిదా వేసింది.

Updated Date - 2021-07-15T07:36:59+05:30 IST