పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నాం
ABN , First Publish Date - 2021-11-26T09:07:21+05:30 IST
పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నాం

ఆయన అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు
కేంద్రం పలువురిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ డైరెక్టర్
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, దూషణలకు పాల్పడుతున్న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సీబీఐ డైరెక్టర్ సుభోద్‌కుమార్ జైస్వాల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇంటర్‌పోల్ జారీచేసిన బ్లూ నోటీస్ ఆధారంగా పంచ్ ప్రభాకర్ అమెరికా న్యూజెర్సీలోని మాంట్‌విల్లీలో నివాసం ఉంటున్నట్లు ఎఫ్‌బీఐ ధ్రువీకరించిందన్నారు. దాని ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసేందుకు సంబంధిత పరిధిలోని కోర్టు నుంచి ఈ నెల 8న నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 9న ఇంటర్‌పోల్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ప్రొవిజనల్ అరెస్ట్ రిక్వెస్ట్ పంపించామని తెలిపారు. ప్రభాకర్ భారత్‌కు వచ్చినప్పుడు అదుపులోకి తీసుకొనేందుకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిందన్నారు. న్యాయవ్యవస్థ పట్ల, హైకోర్టు న్యాయమూర్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలపై అప్పటి రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన వ్యాజ్యం ఆధారంగా హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు పురోగతి వివరాలను సీబీఐ డైరెక్టర్ అఫిడవిట్ రూపంలో ధర్మాసనం ముందు ఉంచారు. ‘ప్రభాకర్ పాస్‌పోర్ట్‌కి సంబంధించిన వివరాలను హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పొందాం. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ చానల్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించాం. దీంతో తాము నమోదు చేసిన కేసులో ప్రభాకర్‌ను 17వ నిందితుడిగా పేర్కొన్నార. సీబీఐ విజ్ఞప్తి మేరకు పంచ్ ప్రభాకర్ పోస్ట్ చేసిన వీడియోలను, యూఆర్‌ఎల్‌లను సామాజిక మాధ్యమ సంస్థ లు భధ్రపరిచాయి. ఐటీ చట్ట నిబంధనలను అనుసరించి పంచ్ ప్రభాకర్‌కి సంబంధించిన యూఆర్‌ఎల్‌లను తొలగించాలని సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ చేశాం. ఆయన యూట్యూబ్ చానల్స్‌తో పాటు ఆయన పెడుతున్న వీడియోలను తొలగించేలా యూట్యూబ్‌ను ఆదేశించండి’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాము నోటీసులు ఇచ్చిన వాటి విషయంలో అభ్యంతరకర పోస్టులు బ్లాక్ చేసేలా, తొలగించేలా ఆదేశించాలని, పోస్టులు మళ్లీ మళ్లీ పెడుతున్న వారి అకౌంట్లను శాశ్వతంగా తొలగించేలా ఆదేశాలివ్వాలని సీబీఐ డైరెక్టర్ కోరారు.
అఫిడవిట్‌లో ఇంకా ఏముందంటే..
‘సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో కుట్రకోణం ఉందేమో తేల్చేందుకు ఇతర అనుమానితులైన వైసీపీ సోషల్‌మీడియా ఇన్‌చార్జ్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డిని ఈ ఏడాది ఆగస్టులో ప్రశ్నించాం. ఆయనతో పాటు షేక్ ఖాదర్, గుంట రమేశ్‌ను విచారించి వారి ఫోన్లను సీజ్ చేశాం. పోస్టులు పెట్టిన వ్యవహారంలో మొత్తం 16మందిపై ఎఫ్‌ఐఆర్ నమో దు చేశాం. ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశాం. ఇతర నిందితులైన మణి అన్నపురెడ్డి, అభిషేక్ రెడ్డి, గునపనేని లింగారెడ్డి, చందురెడ్డి, చిరంజీవి, పంచ్ ప్రభాకర్‌కి సంబంధించిన అకౌంట్ల వివరాలు అందజేయాలని సామాజిక మాధ్యమ సంస్థలను కోరాం. అమెరికాలో ఉన్న మణి అన్నపురెడ్డి అరెస్ట్ కోసం సంబంధిత కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నాం. ఇతర అనుమానితులైన బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, డాక్టర్ ఆర్.గోపి, గడ్డం ఉమ, కరణం వేణుగోపాలరావు, ప్రేమ్‌చంద్ దుడ్ల, వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి, డాక్టర్ రాయుడి గోపి, గంజి అర్జున్ రవీంద్రరెడ్డి, మట్టా సతీశ్‌కుమార్‌ను విచారించాం’.