పొలంలో నీళ్లు... రైతు కళ్లల్లో కన్నీళ్లు

ABN , First Publish Date - 2021-11-28T08:13:25+05:30 IST

పొలంలో నీళ్లు... రైతు కళ్లల్లో కన్నీళ్లు

పొలంలో నీళ్లు... రైతు కళ్లల్లో కన్నీళ్లు

సీఎం జగన్‌కు లోకేశ్‌ లేఖ

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘అకాల వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ జిల్లాల్లో అత్యధికంగా పండించే వరి పంటకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. అప్పు లు చేసి పెట్టుబడులు పెట్టి, ఇంటిల్లిపాదీ శ్రమించి పండించి న పంట చేతికందే సమయంలో వర్షాలకు నీటిపాలై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పొలాల్లో నీళ్లు, కళ్లల్లో కన్నీళ్లతో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రతి ఒక్క రైతుకూ పంట నష్టపరిహారం ఇప్పించాలి. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి. పంట నష్టపరిహారం కౌలు రైతులకూ వర్తించేలా నిబంధనలు మార్చాలి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు శనివారం ఆయన లేఖ రాశారు. ‘‘గోదావరి జిల్లాల్లో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో పంటకు నష్టం ఏర్పడింది. ప్రభుత్వం రైతుకు వరికి హెక్టారుకు రూ.25 వేలు, జొన్నకు రూ.15వేలు, కొబ్బరి చెట్టుకు రూ.3వేలు, ఆక్వాకు హెక్టారుకు రూ.50వేలు పరిహారం అందించాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-28T08:13:25+05:30 IST