Viveka Murder Case : ఎర్ర గంగిరెడ్డి వ్యాఖ్యలకు రంగయ్య స్ట్రాంగ్ రియాక్షన్
ABN , First Publish Date - 2021-07-24T19:53:05+05:30 IST
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకూ పెదవి విప్పని ఆయన వాచ్‌మన్ రంగన్న....

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకూ పెదవి విప్పని ఆయన వాచ్‌మన్ రంగన్న ఇప్పుడు బహిరంగంగానే పలు విషయాలను వెల్లడిస్తున్నారు. నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో రంగన్న మాట్లాడుతూ.. వివేకా హత్యకు ముందు అర్ధరాత్రి ఎవరో కొందరు ఇంట్లోకి వచ్చారని రంగన్న పేర్కొన్నారు. వాళ్లు ఎవరో తనకు తెలియదన్నారు. ‘ఎర్ర గంగిరెడ్డి వివేకాతోనే ఉంటారు. నాతో ఎన్నోసార్లు మాట్లాడారు. ఇప్పుడు నేనెవరో తెలియదంటే ఏమనుకోవాలి..? ’ అని రంగన్న ప్రశ్నించారు. తనకేమీ కాదని అంటేనే సీబీఐకి అన్ని విషయాలు చెప్పానన్నారు. నిన్న జమ్మలమడుగు కోర్టులో జడ్జి ముందు వాంగ్మూలం తీసుకున్నారని రంగన్న వెల్లడించారు.
ఆయనెవరో నాకు తెలియదు..!
ఇవాళ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో వివేకా హత్యకేసులోని కీలక నిందితుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. ‘వివేకానందరెడ్డి నాకు దేవుడితో సమానం. నేను చీమకు కూడా హాని చేయను. కేవలం వివేకాతో నేను సన్ని హితంగా వుండటం వల్లే కేసులు పెట్టారు. నన్ను సీబీఐ విచారిస్తోంది. వాచ్మెన్ రంగన్నను వివేకా ఇంట్లో చూశానే తప్ప ఏ రోజూ మాట్లాడలేదు. రంగన్నను నేను బెదిరించింది అవాస్తవం. వివేకా హత్యకేసులో నా ప్రమేయం ఉందని అతను నాపై ఎలా చెబుతున్నాడో అర్ధం కావట్లేదు. వివేకా హత్యకేసులో నా ప్రమేయం ఉందంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం.. ఏ ప్రమాణానికైనా సిద్ధం. హత్యజరిగిన రోజు రాత్రి ముందు వివేకాతో కలిసే ఉన్నాం. నన్ను మా ఇంటి దగ్గర దింపి ఆయన ఇంటికెళ్లారు. హత్య జరిగిందని ఉదయం 7 గంటలకు వివేకా బావమరిది నాకు కాల్ చేసి చెప్పారు. వివేకా కుమార్తె సునీత కూడా నన్ను వివరాలు అడిగారు. రాత్రి తిరిగివచ్చిన వివరాలు ఆమెకు వివరించాను’ అని ఏబీఎన్‌తో గంగిరెడ్డి చెప్పారు.
