సునీల్‌ యాదవ్‌కు నార్కో పరీక్షలపై తీర్పు రిజర్వ్‌!

ABN , First Publish Date - 2021-09-02T09:16:33+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో యాదాటి సునీల్‌యాదవ్‌కు నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ

సునీల్‌ యాదవ్‌కు నార్కో పరీక్షలపై తీర్పు రిజర్వ్‌!

జమ్మలమడుగు కోర్టులో ముగిసిన వాదనలు


కడప(ఆంధ్రజ్యోతి), జమ్మలమడుగు రూరల్‌, కడప(క్రైం), సెప్టెంబరు 1: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో యాదాటి సునీల్‌యాదవ్‌కు నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసినట్లు తెలిసింది. జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్‌ బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. గత 87 రోజులుగా సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కీలక అనుమానితుడిగా భావిస్తున్న యాదాటి సునీల్‌యాదవ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ పలుమార్లు విచారించింది. విచారణ పేరుతో తమను సీబీఐ వేధిస్తోందని సునీల్‌ యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోగా.. గోవాలో సీబీఐ అధికారులు అరెస్టు చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.


14 రోజుల రిమాండ్‌ అనంతరం కడప సెంట్రల్‌ జైల్‌కు పంపించారు. అయితే, సునీల్‌ యాదవ్‌ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గత నెల 27న జమ్మలమడుగు కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. న్యాయమూర్తి బాబాఫకృద్దీన్‌ జూమ్‌ యాప్‌ ద్వారా విచారణ చేపట్టగా సునీల్‌ న్యాయవాది హితే్‌షకుమార్‌ వాదనలు వినిపించారు. సీబీఐ న్యాయవాది జమ్మలమడుగు కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్లు తెలిసింది. 


కదిరి వ్యాపారులను విచారించిన సీబీఐ

వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారణ కొనసాగిస్తున్నారు. బుధవారం అనంతపురం జిల్లా కదిరికి చెందిన ముగ్గురు వ్యాపారులను పిలిపించి 5 గంటలపాటు విచారించినట్టు సమాచారం.

Updated Date - 2021-09-02T09:16:33+05:30 IST