విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు
ABN , First Publish Date - 2021-03-24T09:19:53+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు

కేప్టివ్ మైన్స్ కేటాయిస్తే సమస్య పరిష్కారం
ఐఎన్‌టీయూసీ, ఉక్కు పరిరక్షణ సమితి డిమాండ్
న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తూ కార్మికుల గొంతు కోసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఐఎన్‌టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఢిల్లీ వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంటు కార్మిక సంఘాల తరఫున విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి చైర్మన్ నరసింగరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కుకు కేప్టివ్ మైన్స్ కేటాయించమని కొన్నేళ్లుగా కోరుతున్నా పట్టించుకోకపోగా ఇపుడు నష్టాల నెపంతో ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలను కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తాలని కోరినట్లు చెప్పారు. నరసింగరావు మాట్లాడుతూ.. ప్లాంటును ప్రైవేటీకరించే హక్కు కేంద్రానికి లేదన్నారు. ఏప్రిల్ 18న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.