‘ఉక్కు’ భూములతో వ్యాపారం!

ABN , First Publish Date - 2021-04-14T09:48:54+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. కర్మాగారం నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరణ చేస్తామని చెబుతూనే ప్లాంటుకు చెందిన విలువైన భూములతో

‘ఉక్కు’ భూములతో వ్యాపారం!

ఏడాది క్రితమే ఎన్‌బీసీసీఎల్‌తో ఒప్పందం 

క్వార్టర్లు కూలగొట్టి వాణిజ్య సముదాయాలు

ఇక్కడ స్థలం విలువే రూ.1,600 కోట్లు

ప్రస్తుతం గజం రేటు రూ.1.5 లక్షలు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. కర్మాగారం నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరణ చేస్తామని చెబుతూనే ప్లాంటుకు చెందిన విలువైన భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌బీసీసీఎల్‌)తో ఏడాది క్రితమే ఒప్పందం చేసుకుంది. దానిని సదరు కంపెనీ ఇప్పుడు బయటపెట్టింది. స్టీల్‌ప్లాంటు ఉద్యోగుల కోసం సీతమ్మధారను ఆనుకొని ఉన్న హెచ్‌బీ కాలనీలో 22.19 ఎకరాల విస్తీర్ణంలో 30ఏళ్ల క్రితం 830 క్వార్టర్లు నిర్మించారు. ఇవి ప్లాంటుకు 15 కి.మీ. దూరాన ఉండటంతో అప్పట్లో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు.


దాంతో ప్లాంటును ఆనుకొని 4వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌ నిర్మించారు. దాదాపు 95శాతం ఉద్యోగులు అక్కడే ఉంటున్నారు. సరైన నిర్వహణ లేక ఇక్కడి క్వార్టర్లు శిథిలమైపోయాయి. వాటిలో 130 క్వార్టర్లకు మరమ్మతులు చేసి కిందిస్థాయి కార్మికులకు ఇచ్చారు. అవి కూడా నేడో, రేపో అన్నట్టుగా మారాయి. ఇప్పుడు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. ఇక్కడ గజం స్థలం రూ.1.5 లక్షల వరకూ పలుకుతోంది. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన అపార్ట్‌మెంట్‌ 36 అంతస్థుల ఆక్సిజన్‌ టవర్స్‌ ఈ క్వార్టర్లకు 500 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాంతంలో ఫ్లాట్‌ కొనాలంటే ప్రస్తుతం చ.అ.కు రూ.7 వేల నుంచి రూ.8వేల వరకూ చెల్లించాలి. అటువంటి చోట 22.19 ఎకరాల్లో వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయించడానికి స్టీల్‌ప్లాంటు, ఎన్‌బీసీసీఎల్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఇక్కడ ప్లాంటు భూమి విలువే రూ.1,600కోట్ల వరకు ఉంటుంది. అక్కడ భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి చ.అ. ధర రూ.10 వేలకు చేరుతుంది. వాటి అమ్మకాలతో కొన్ని రూ.వేల కోట్ల ఆదాయం వస్తుంది. కేవలం ఈ ఒక్క భూ లావాదేవీలతో స్టీల్‌ప్లాంట్‌ నష్టాలు సగం తీరిపోతాయి. ప్లాంటును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమే ఉండదు. కానీ కేంద్రం ఆ దిశగా ఆలోచించకుండా ప్లాంటు భూములను ముక్కలు ముక్కలుగా చేసి అమ్మడానికి యత్నిస్తోంది. అందులో భాగంగానే పోస్కోకు స్టీల్‌ప్లాంటు నిర్మాణం కోసం భూములు ఇస్తామని ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీ 3వేల ఎకరాలు డిమాండ్‌ చేస్తోంది. అక్కడ ప్రస్తుతం భూమి ధర ఎకరా రూ.10 కోట్లు ఉంది. అంటే పోస్కోకు రూ.30 వేల కోట్ల విలువైన భూమిని అప్పగించనున్నారు. 


ఎన్‌బీసీసీఎల్‌కు 7% ఫీజు 

స్టీల్‌ప్లాంటు భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసినందుకు ఎన్‌బీసీసీఎల్‌కు ప్రాజెక్టు వ్యయంలో 7 శాతం ఫీజుగా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంటే కేవలం భూమిని అమ్మి పెడితే ఆ సంస్థకు రూ.112 కోట్లు దక్కుతాయి. మళ్లీ దీనిని మార్కెటింగ్‌ చేస్తే 1 శాతం ఫీజు ఇస్తామని అంగీకరించింది. అది ఇంకో రూ.16 కోట్ల వరకు ఉంటుంది. మొత్తంగా ఈ డీల్‌ ద్వారా ఎన్‌బీసీసీఎల్‌కు రూ.130 కోట్ల వరకు చేతికి అందుతుంది. 


రూ.వెయ్యి కోట్లు ఆదాయం

ఎన్‌బీసీసీఎల్‌ అంచనా

హెచ్‌బీ కాలనీలో 22.19 ఎకరాలను విక్రయిస్తే రూ.వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఎన్‌బీసీసీఎల్‌ అంచనా వేసింది. గజం రూ.లక్ష చొప్పున రేటు వస్తుందని ఆ సంస్థ లెక్క కట్టింది. వాస్తవానికి విశాఖలోని ఆ ప్రాంతంలో గజం రూ.1.5 లక్షలు వరకూ పలుకుతోంది. అంత రేటు పెట్టడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నా కూడా ఎక్కువ విస్తీర్ణంలో భూమి అక్కడ లభించడం లేదు. స్టీల్‌ప్లాంటు క్వార్టర్లన్నీ ఒకే దగ్గర ఉండటం, ఇప్పటికే రహదారుల సదుపాయం కూడా ఉండటంతో మంచి ధరే వస్తుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-04-14T09:48:54+05:30 IST