ఏసీబీ వలలో విశాఖ ఎస్‌ఐ

ABN , First Publish Date - 2021-08-21T08:49:37+05:30 IST

ఒక కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడంతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులను తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఆరిలోవ ఎస్‌ఐ కె.శ్రీనివాసరావు శుక్రవారం ఏసీబీకి..

ఏసీబీ వలలో విశాఖ ఎస్‌ఐ

‘స్టేషన్‌ బెయిల్‌’కు లంచం.. రిమాండ్‌కు తరలింపు


విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఒక కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడంతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులను తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఆరిలోవ ఎస్‌ఐ కె.శ్రీనివాసరావు శుక్రవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీవీఎస్‌ రమణమూర్తి శుక్రవారం మీడియాకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఇక్కడి ఆరిలోవలో ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి వైకుంఠరావు దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి.  వైకుంఠరావు భార్య గత ఏడాదిలో ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైకుంఠరావుతోపాటు అతని తల్లిదండ్రులు, సోదరిపై ఎస్‌ఐ శ్రీనివాసరావు 498(ఎ)తోపాటు 324 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అయితే, కేసు నుంచి తన తల్లిదండ్రులు, సోదరిని తప్పించడంతోపాటు తనకు స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించాలని వైకుంఠరావు కోరగా, అందుకు ఎస్‌ఐ రూ.పది వేలు లంచం డిమాండ్‌ చేశారు. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని వైకుంఠరావు.. తప్పనిసరై రూ.7వేలకు బేరం కుదుర్చుకుని, ఇదే విషయంపై గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఆరిలోవ స్టేషన్‌లో వైకుంఠరావు నుంచి రూ.ఏడు వేలు లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐ శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో ఆయన ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-08-21T08:49:37+05:30 IST