కన్యాదానం చేశారు... తనువు చాలించారు!

ABN , First Publish Date - 2021-08-27T08:57:56+05:30 IST

కల్యాణమండపంలో మేళతాళాలు ఆగనేలేదు...బంధువులు పెళ్లిసందడి ముచ్చట్ల నుంచి తెప్పరిల్లనూ లేదు...

కన్యాదానం చేశారు...  తనువు చాలించారు!

దంపతుల అనుమానాస్పద మృతి 

వివాహ తంతు పూర్తి కాకుండానే విషాదం

విశాఖలో ఘటన


ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం), ఆగస్టు 26: కల్యాణమండపంలో మేళతాళాలు ఆగనేలేదు...బంధువులు పెళ్లిసందడి ముచ్చట్ల నుంచి తెప్పరిల్లనూ లేదు...వధూవరులు ఇంకా వేదిక దిగనూ లేదు...ఇంతలోనే కన్యాదానం చేసిన ఆ దంపతులు ఈ లోకం వీడి వెళ్లిపోయారు.   విశాఖపట్నం హెచ్‌బీ కాలనీ భానునగర్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాదసంఘటన పలువురిని కలచివేసింది. ఎంవీపీ జోన్‌ సీఐ రమణయ్య తెలిపిన వివరాలు... భానునగర్‌కు చెందిన వడ్డాది జగన్నాథరావు(63), విజయలక్ష్మి(57) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె భారతి వివాహం గురువారం తెల్లవారుజామున హెచ్‌బీ కాలనీలోని మయూరి ఫంక్షన్‌ హాలులో జరిగింది. జగన్నాథరావు, విజయలక్ష్మి దంపతులు బుధవారం మధ్యాహ్నమే ఫంక్షన్‌ హాలుకు చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున కన్యాదానం చేశారు. అనంతర కార్యక్రమాల కోసం దంపతులను పిలవగా ఎక్కడా కనిపించలేదు. దీంతో జగన్నాథరావు అన్న కుమారుడు వడ్డాది వెంకట్‌ భానునగర్‌లోని వారి నివాసానికి వెళ్లి చూడగా దంపతులు ఇద్దరు మృతిచెంది  ఉన్నారు.


జగన్నాథరావు గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతుండగా, విజయలక్ష్మి మంచంపై మృతి చెంది ఉన్నారు. వారి మృతికి కారణాలు తెలియరాలేదు. కాగా, కొంతకాలం నుంచి విజయలక్ష్మి మానసిక సమస్యతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో వారు తరచూ గొడవపడుతుండేవారని బంధువులు తెలిపారు. పెళ్లి మండపంలో కూడా వారు గొడవపడినట్టు చెబుతున్నారు.  దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-08-27T08:57:56+05:30 IST