12 వీఐపీ దర్శన టికెట్లు రూ.70 వేలకు విక్రయం

ABN , First Publish Date - 2021-10-21T00:31:54+05:30 IST

కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటూ కొందరు దళారులు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు.

12 వీఐపీ దర్శన టికెట్లు రూ.70 వేలకు విక్రయం

తిరుమల: కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటూ కొందరు దళారులు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ హోటల్‌ మేనేజర్‌ 12 వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను రూ.70 వేలకు విక్రయించడం విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడింది. విజయనగరానికి చెందిన రఘువంశీ ఐదుగురు కుటుంబ సభ్యులతో మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్దకు వచ్చాడు. వారి వద్దనున్న టికెట్లు, గుర్తింపు కార్డులను పరిశీలించిన విజిలెన్స్‌ సిబ్బందికి అనుమానం కలిగింది. దర్శన టికెట్లు ఎలా పొందారని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో వారిని దర్శనం తర్వాత అదుపులోకి తీసుకుని విచారించారు. తిరుపతిలో ఒక హోటల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సూరి అనే వ్యక్తి అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ ద్వారా ఆరుగురికి రూ.25 వేల నగదు తీసుకుని టికెట్లు ఇచ్చినట్టు భక్తులు తెలిపారు. దీంతో విజిలెన్స్‌ అధికారుల నివేదిక మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-21T00:31:54+05:30 IST