హైకోర్టు హాల్స్‌ పనులు ‘ఎన్‌సీసీ’కే!

ABN , First Publish Date - 2021-10-07T08:29:35+05:30 IST

హైకోర్టు హాల్స్‌ కాంప్లెక్స్‌ పనులకు సంబంధించి అమరావతి మహానగర ప్రాంత ప్రాధికార సంస్థ(ఏఎంఆర్‌డీఏ) పిలిచిన రివర్స్‌ టెండర్లలో ఎన్‌సీసీ సంస్థ దాదాపు అర్హత సాధించింది. రివర్స్‌ టెండర్లలో రూ.కోటి తక్కువ వ్యయంతో ఈ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది.

హైకోర్టు హాల్స్‌ పనులు ‘ఎన్‌సీసీ’కే!

  • రివర్స్‌ టెండర్‌లో అర్హత పొందిన సంస్థ
  • కాంట్రాక్టుపై అధికార ప్రకటనే తరువాయి
  • రూ.కోటి త క్కువ వ్యయంతో పనులకు సిద్ధం
  • ఇప్పటికే రాజధాని అమరావతిలో పలు కీలక ప్రాజెక్టులు చేపట్టిన సంస్థగా గుర్తింపు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): హైకోర్టు హాల్స్‌ కాంప్లెక్స్‌ పనులకు సంబంధించి అమరావతి మహానగర ప్రాంత ప్రాధికార సంస్థ(ఏఎంఆర్‌డీఏ) పిలిచిన రివర్స్‌ టెండర్లలో ఎన్‌సీసీ సంస్థ దాదాపు అర్హత సాధించింది. రివర్స్‌ టెండర్లలో రూ.కోటి తక్కువ వ్యయంతో ఈ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు ఆవరణలో 14 కోర్టు హాల్స్‌ కాంప్లెక్స్‌ పనులకు రూ.29 కోట్ల వ్యయంతో ఏఎంఆర్‌డీఏ టెండర్లను పిలిచింది. గత ఆగస్టులో తొలిసారి ఏఎంఆర్‌డీఏ పిలిచిన టెండర్లకు కేఎంవీ సంస్థ మాత్రమే బిడ్‌ను దాఖలు చేసింది. సెప్టెంబరులో రెండోసారి టెండర్లు పిలవగా రెండు బిడ్లు దాఖలయ్యాయి. మొదటిసారి టెండర్లలో పాల్గొన్న కేఎంవీ సంస్థతోపాటు ఎన్‌సీసీ సంస్థ కూడా టెండర్లలో పాల్గొంది. రివర్స్‌ బిడ్డింగ్‌లో ఎన్‌సీసీ సంస్థ దాదాపు అర్హత సాధించటంతో ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలివుంది.


రివర్స్‌ బిడ్డింగ్‌లో ఎన్‌సీసీ సంస్థ తక్కువ కోట్‌ చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఏఎంఆర్‌డీఏ రెండు రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనుంది. ప్రభుత్వ పరిశీలన అనంతరం అధికారికంగా రివర్స్‌ టెండరింగ్‌పై ప్రకటించే అవకాశం ఉంది. హైకోర్టు ఆవరణలో మొత్తం 14 కోర్టు హాల్స్‌ను జీ ప్లస్‌ త్రీ విధానంలో నిర్మించేందుకు టెండర్లను పిలిచారు. అయితే.. కారణాలు ఏవైనా కాంట్రాక్టు సంస్థలు టెండర్లు వేయటానికి ఆసక్తి చూపలేదు. ఈ సమయంలో అనుకోకుండా ఎన్‌సీసీ సంస్థ టెండర్లలో పాల్గొంది. ఇదిలావుంటే, ఈ సంస్థ రాజధానిలో ఇప్పటికే అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలు, సెక్రటేరియట్‌ హెచ్‌వోడీ, జీఏడీ టవర్‌ నిర్మాణం, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఎన్‌-10 రహదారి ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉంది. 

Updated Date - 2021-10-07T08:29:35+05:30 IST