మూడు రాజధానులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఇది: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-03-14T23:53:49+05:30 IST

జగన్ పనితీరుకు ప్రజలు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఇదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

మూడు రాజధానులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఇది: విజయసాయిరెడ్డి

విశాఖ: మూడు రాజధానులకు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కి అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఇదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని వ్యాఖ్యానించారు. విశాఖలో చంద్రబాబునాయుడు, లోకేష్ నీతిమాలిన రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఏపీలో చంద్రబాబు, లోకేష్ లేరని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్ష నేతలు లేరు.. వీరంతా ఏపీకి టూరిస్టులుగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. జీవీఎంసీలో చాలా వార్డులు పోగొట్టుకున్నాం, విశ్లేషణ చేసుకుంటామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 58 డివిజన్లలో వైసీపీ జెండా రెపరెపలాడింది. టీడీపీ- 30, జనసేన-03, ఇతరులు-07 స్థానాల్లో గెలుపొందారు. కాగా.. మొదటి నుంచి విజయవాడ, విశాఖపట్నంలో వైసీపీ జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్‌తో వైసీపీ అధిష్ఠానం వ్యూహాలు రచిస్తుంది.

Updated Date - 2021-03-14T23:53:49+05:30 IST