వెలిగొండ..గుదిబండ!

ABN , First Publish Date - 2021-08-27T08:33:26+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

వెలిగొండ..గుదిబండ!

కేటాయింపులన్నీ కాగితాలపైనే.. బిల్లుల చెల్లింపులో జాప్యం

నత్తనడకన నిర్మాణ, పునరావాస పనులు

మొదటి టన్నెల్‌ పూర్తయినా..

జలాశయానికి నీరు వదల్లేని దుస్థితి

40 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో

రెండో టన్నెల్‌ పనులు నిలిపివేత

వన్‌టైం సెటిల్‌మెంట్‌కు 431 కోట్లివ్వాలి

పైసా కూడా విడుదల చేయని సర్కారు

పునరావాస ఇళ్లకు 171 కోట్లతో టెండర్లు

నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు


‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.41 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తా, రైతు ఇంట ఆనందాన్ని నింపుతా’ ..2019లో ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నాటి విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వాగ్దానమిది. కానీ గద్దెనెక్కి రెండేళ్లు దాటినా ఈ పథకం పనులు ముందుకు కదలడం లేదు. 


మార్కాపురం, ఆగస్టు 26: వెలిగొండ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఏడాదిలోపే పనులు పూర్తిచేస్తానన్న జగన్మోహన్‌రెడ్డి.. సీఎం అయ్యాక కొన్నాళ్లు రివర్స్‌ టెండరింగ్‌ పేరిట కాలయాపన చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులకు, నిర్వాసితులకు పునరావాస కల్పనకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. అది కాగితాలకే పరిమితం. గత రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పునరావాసానికి 2021-22 బడ్జెట్‌లో రూ.1,450 కోట్లు కేటాయించినా పైసా మంజూరు కాలేదు. కృష్ణానది వద్ద కొల్లంవాగు నుంచి నల్లమల జలాశయానికి నీటిని సరఫరా చేసే మొదటి టన్నెల్‌ పూర్తయింది. కానీ శ్రీశైలం ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పటికీ దీనిగుండా నీరివ్వడంలేదు. పనులన్నీ అసంపూర్తిగా ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. పురోగతి లేని పునరావాస చర్యలు, అసంపూర్తిగా ఫీడర్‌కెనాల్‌, తీగలేరు పనులు.. వెరసి వెలిగొండకు నీరివ్వలేని దుస్థితి నెలకొంది.


చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. లింక్‌ కెనాల్‌, తూర్పు ప్రధాన కాల్వలకు సంబంధించి సుమారు రూ.7కోట్లు, వెస్ట్రన్‌ బ్రాంచి కెనాల్‌ పనులకు సంబంధించి రూ.14కోట్లు, కొల్లం వాగు వద్ద నిర్మాణంలో ఉన్న హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.8కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దోర్నాల మండలం కొత్తూరు వద్ద ప్రారంభమైన 2 టన్నెళ్ల నుంచి జలాశయానికి నీరు చేరడానికి అనుసంధానంగా ఫీడర్‌ కెనాల్‌ తవ్వుతున్నారు. 2008లో ప్రారంభమైన పనులు నేటీకీ పూర్తికాలేదు. ఫీడర్‌ కెనాల్‌పై 20 వంతెనలు నిర్మించాల్సి ఉండగా 14 పూర్తయ్యాయి. 6 వంతెల నిర్మాణం ప్రారంభమే కాలేదు. నిరుడు జూన్‌లో నల్లమలలో భారీవర్షాలు కురవడంతో ఫీడర్‌ కెనాల్‌కు పెద్దఎత్తున నీరుచేరింది. ఆ ఉధృతికి కెనాల్‌కు దోర్నాల మండలం కడపరాజుపల్లె వద్ద భారీ గండిపడింది. మూడ్రోజుల కిందట కతకానిపల్లె వద్ద మరో గండి పడింది. వర్షపునీటికే గండిపడిన ఫీడర్‌ కెనాల్‌.. టన్నెళ్ల ద్వారా వచ్చే నీటి ఉధృతికి తట్టుకుని నిలబడగలదా? జలాశయానికి నీరుచేరడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


వర్షపు నీటికే గండి పడడంతో నీటిపారుదల శాఖ అధికారులు కొత్తూరు నుంచి జలాశయం వరకూ సిమెంట్‌ అలైన్‌మెంట్‌ చేసి కాలువను పటిష్ఠపరచాలని నిర్ణయించారు. రూ.120కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారుచేశారు. ఆ ఫైలు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. అది పూర్తయి నిధులు ఎప్పుడు మంజూరుచేస్తారో.. పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాలకు సాగునీరు అందించేందుకు నిర్దేశించించిన తీగలేరు కాలువను గొట్టిపడియ డ్యాం నుంచి 5మండలాల్లో 48.300 కి.మీ. పొడవున నిర్మించాల్సి ఉంది. ఇందులో 47.050 కి.మీ. పూర్తయింది. ఈ కాలువపై 73 వంతెనలకు గాను 40 మాత్రమే పూర్తయ్యాయి. 33 వంతెనల నిర్మాణం మొదలుకాలేదు.


మొదటి టన్నెల్‌ నిర్మాణం పూర్తి..

ప్రాజెక్టులో భాగంగా టన్నెల్‌-1 నిర్మాణం 2008 ఆగస్టు 19న ప్రారంభమై 2021 ఏప్రిల్‌లో పూర్తయింది. అంచనా వ్యయం రూ.624 కోట్లు. కొత్తూరు నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోని కొల్లంవాగు వరకూ 18.80 కి.మీ. పొడవుంది. దీనికి సమాంతరంగా ఇంతే పొడవుతో రెండో టన్నెల్‌ చేపట్టారు. తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు. 12 కి.మీ. మాత్రమే తవ్వారు. కాంట్రాక్టరుకు రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉండటంతో 6నెలలపాటు పనులు నిలిపేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8018.90 కోట్లు కాగా... నిరుడు మార్చి నాటికి రూ.5,330.04 కోట్లు ఖర్చుచేశారు. ఈ ఏడాది మార్చిలోపు మరో రూ.318.21 కోట్లు ఖర్చుచేశామని అధికారులు పేర్కొన్నారు. ఇంకా రూ.2,370.65 కోట్లు ఈ ప్రాజెక్టుకు వ్యయం చేయాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం సుంకేశుల, అర్ధవీడు మండలం కాకర్ల వద్ద ఆనకట్టలు నిర్మించారు. వీటి కారణంగా గొట్టిపడియ, అక్కచెరువు తాండ, సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల, చింతలముడిపి, కాటంరాజుతాండ, సాయిరామ్‌నగర్‌, రామలింగేశ్వరపురం, లక్ష్మీపురం, కృష్ణానగర్‌ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారంగా చెల్లించేందుకు రెండు ప్రతిపాదనలను తయారుచేసింది.


అందులో ఒకటి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కాగా, రెండోది వన్‌టైం సెటిల్‌మెంట్‌. గొట్టిపడియ, గుండంచెర్ల నిర్వాసితులు తప్ప మిగిలిన గ్రామాల్లో 3,455మంది వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకారం తెలిపారు. దీనికోసం రూ.431.50 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. రూపాయి కూడా ఇవ్వలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 3,153 మంది నిర్వాసితులకు ఇళ్లు నిర్మించే బాధ్యతను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. రూ.171.36 కోట్ల అంచనాలతో 7 ప్యాకేజీల్లో ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 1న టెండర్లు పిలిచారు. ఒక్కరు కూడా టెండర్‌ వేయలేదు. దీంతో మళ్లీ 24న నోటిఫికేషన్‌ ఇచ్చారు. బేస్తవారపేట మండలం ఒందుట్ల వద్ద నిర్మించ తలపెట్టిన ప్యాకేజీకి మాత్రమే 3టెండర్లు దాఖలయ్యాయి. మిగతావాటికి ఎవరూ దాఖలు చేయలేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందన్న నమ్మకం లేకపోవడం వల్లే కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు.


ఎన్నో పునాది రాళ్లు..

వెలిగొండ ప్రాజెక్టుకు తొలుత 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దారవీడు మండలం సుంకేశుల వద్ద శంకుస్థాపన చేశారు. తర్వాత 2006లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మార్కాపురం మండలం గొట్టిపడియ వద్ద మళ్లీ పునాది రాయి వేశారు. 2008 ఆగస్టు 18న ఆయన మొదటి టన్నెల్‌ పనులకు శంకుస్థాపన చేశారు. 2009 సెప్టెంబరు 17న అప్పటి ఇరిగేషన్‌ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రెండో టన్నెల్‌కు పునాది రాయి వేశారు. అప్పటి నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. నిధులిచ్చి.. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే ఎంతలేదన్నా మరో నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-08-27T08:33:26+05:30 IST