టీచర్ల నైపుణ్యాల పెంపునకు వర్సిటీ

ABN , First Publish Date - 2021-12-30T08:19:11+05:30 IST

ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రకాశంలోని ఆంధ్రకేసరి అధ్యయన కేంద్రాన్ని.. విశ్వవిద్యాలయంగా తీసుకురానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

టీచర్ల నైపుణ్యాల పెంపునకు వర్సిటీ

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

దివాన్‌చెరువు, డిసెంబరు 29: ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రకాశంలోని ఆంధ్రకేసరి అధ్యయన కేంద్రాన్ని.. విశ్వవిద్యాలయంగా తీసుకురానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు ఇటీవల మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. జాతీయ విద్యావిధానం అమలు ప్రధానోపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి సురేశ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నన్నయ విశ్వవిద్యాలయ  ఉపకులపతి మొక్కా జగన్నాథరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ  దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టం చేసి ఉపాధ్యాయుల్లో నైౖపుణ్యాల పెంపునకు ఆంధ్రకేసరి వర్సిటీని తీసుకు వచ్చిందన్నారు. రాష్ట్ర విద్యావ్యవస్థను పటిష్టపరిచే విధంగా డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. విద్యారంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ, ఐ.వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్‌ టి.అశోక్‌, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


జనవరి 28 నుంచి ఏఐటీయూసీ మహాసభలు

ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభలు జనవరి 28 నుంచి 31 వరకు గుంటూరులో జరుగుతాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు తెలిపారు. ఈ మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజిత్‌కౌర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. జనవరి 12న విజయవాడలో ‘ప్రభుత్వ రంగ సంస్థలు - ప్రభుత్వాల దాడి’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. 19న విశాఖపట్నంలో రక్షణ రంగం - స్టీలు, ఓడరేవులు, విమానయాన సర్వీసుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసన కార్యక్రమానికి రక్షణ రంగ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్‌ హాజరవుతారన్నారు. 

Updated Date - 2021-12-30T08:19:11+05:30 IST