మావోయిస్టు అగ్రనేత.. సుబ్రహ్మణ్యం దంపతులెక్కడ?

ABN , First Publish Date - 2021-03-22T08:57:40+05:30 IST

మావోయిస్టు అగ్రనేత వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్‌ అభయ్‌ దంపతులు ఎక్కడ? చండీగఢ్‌ నుంచి దురంతో రైలులో విజయవాడలో దిగాల్సిన ఈ దంపతుల జాడ తెలియడం లేదు. విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆయన బావమరిది

మావోయిస్టు అగ్రనేత.. సుబ్రహ్మణ్యం దంపతులెక్కడ?

చండీగఢ్‌ నుంచి విజయవాడ వస్తుండగా అదృశ్యం

వారి కోసం వెళ్లిన బంధువు కూడా ముగ్గురూ పోలీసుల అదుపులోనే!


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్‌ అభయ్‌ దంపతులు ఎక్కడ? చండీగఢ్‌ నుంచి దురంతో రైలులో విజయవాడలో దిగాల్సిన ఈ దంపతుల జాడ తెలియడం లేదు. విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆయన బావమరిది పాలడుగు విజయం కూడా కనిపించడం లేదు. ఆదివారం మధ్యా హ్నం నుంచి వీరి ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. దీంతో వీరి కుటుంబీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వారి అదృశ్యం ఎస్‌ఐబీ పోలీసుల పనేనని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సుబ్రహ్మణ్యం మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో పనిచేశారు. 2010 జూలై 1న ఆదిలాబాద్‌ అడవుల్లో నాటి అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్‌ ఆలియాస్‌ అజాద్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆ తర్వాత అభయ్‌ పేరుతో సుబ్రహ్మణ్యం అధికార ప్రతినిధిగా ఉన్నారు.


దాదాపు 30 ఏళ్లపాటు ఆయన పీపుల్స్‌వార్‌లో, ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కువ కాలం విశాఖ జైలులోనే ఉన్నారు. ఇటీవలి కాలంలో బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ప్ర కాశం జిల్లా మార్కాపురంలో భార్య లక్ష్మితో ఉంటున్నారు. 65 ఏళ్లకు పైబడిన ఆయనకు నెల రోజుల క్రితం చండీగఢ్‌లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స జరిగిందని.. తా జాగా మళ్లీ భార్యతో కలిసి ఆయన చండీగఢ్‌ వెళ్లారని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌లో దిగాల్సి ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వారిని ఇంటికి తీసుకొచ్చేందుకు సుబ్రహ్మణ్యం బావమరిది విజయం కారులో స్టేషన్‌కు వెళ్లారని వివరించారు. అయితే ఆ దంపతులు గానీ.. విజయం గానీ ఇంటి కి రాలేదు. దీంతో అనుమానం వచ్చి అన్ని చోట్లా వాకబు చేశామని, వారి సెల్‌ఫోన్లు కూడా స్విచాఫ్‌ అయి ఉన్నాయని బంధువులు తెలిపారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నేత గురజాల రవీందర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు నేతల కు షెల్టర్‌ ఇవ్వడంతో పాటు వారితో సంబంధాలు కలిగి ఉన్నారన్న అభియోగాలు మోపారు. గతంలో అభయ్‌కు ఆశ్రయం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం దంపతుల అదృశ్యం వెనుక పోలీసుల హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాను క్షేమంగా ఉన్నానంటూ ఆయన ఫోన్‌ నుంచి రాత్రి 7.30 గంటలకు బంధువుల్లో ఒకరికి మెసేజ్‌ వచ్చింది.  


వెంటనే విడుదల చేయాలి: రేణుకాదేవి

రాత్రి 9 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం సోదరి రేణుకాదేవి ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. పోలీసులే స్టేషన్‌కు తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. తన అన్నయ్యకు మోకాలి శస్త్రచికిత్స జరిగింద ని.. ఆరోగ్యం బాగోలేదని.. విడుదల చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

 

ఇది పోలీసుల పనే..: చంద్రశేఖర్‌

సుబ్రహ్మణ్యం, ఆయన భార్య, బంధువు అదృశ్యం పోలీసుల పనేనని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ ఆరోపించారు. విజయం కారు మాత్రమే రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో ఉందని ఆదివారం రా త్రి ఓ ప్రకటనలో తెలిపారు. సుబ్రహ్మణ్యం తెలంగాణలో నివసించడానికి సహాయపడ్డారంటూ టీవీవీ రాష్ట్ర బాధ్యుడు గురజాల రవీందర్‌రావును పోలీసులు అరెస్టు చేశారని.. ఈ నేపఽథ్యంలో వీరిని కూడా పోలీసులే అదుపులోకి తీసుకుని ఉంటారని ఆరోపించారు. 

Updated Date - 2021-03-22T08:57:40+05:30 IST