ఇంటింటికీ టీకాలు

ABN , First Publish Date - 2021-12-28T08:46:53+05:30 IST

కొవిడ్‌ వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇంటింటికీ టీకాలు

  • బూస్టర్‌ డోస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • ఒమైక్రాన్‌పై భయాందోళనలు వద్దు
  • వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో జగన్‌
  • శాఖలో సాధారణ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ 


అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఉధృతంగా వ్యాక్సినేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలని, ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే వారికి టీకాలు వేయాలని సూచించారు. కేంద్రం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధులకు బూస్టర్‌ డోస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వారితో కలుపుకొని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ అవసరమని ప్రాథమిక అంచనా వేశామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 6 ఒమైక్రాన్‌ కేసులున్నాయని తెలిపారు. 


వీరిలో ఎవ్వరూ ఆస్పత్రిపాలు కాలేదని తెలిపారు. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరంలేద ని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు గమనిస్తూ చర్యలు తీసుకోవాలని, డేటాను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ‘‘టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతుల్లో పోవాలి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలి. సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలి. వచ్చేవారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దాం. విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని ట్రేస్‌ చేయాలి. ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలి. వారికి క్రమం తప్పక పరీక్షలు జరపాలి. పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేయాలి’’ అని జగన్‌ అన్నా రు. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాలల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో సాధారణ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని, ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లనూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-12-28T08:46:53+05:30 IST