వైసీపీ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-08-25T09:15:51+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడే వ్యాక్సిన్‌ వేయాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం వ్యాక్సినేషన్‌

వైసీపీ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌

అధికార పార్టీ నేతల జులుం

వైద్య సిబ్బందిపై ఒత్తిడి


విజయవాడ (పూర్ణానందంపేట), ఆగస్టు 24: కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడే వ్యాక్సిన్‌ వేయాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఏకంగా తమ పార్టీ కార్యాలయానికే మార్చేశారు. అక్కడ తాము అనుకున్న వారికే వ్యాక్సిన్‌ ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం విజయవాడలోని 35వ డివిజన్‌ బాప్టి్‌స్టపాలెంలోని వైసీపీ కార్యాలయంలోనే వ్యాక్సినేషన్‌ చేపట్టాలని స్థానిక కార్పొరేటర్‌ బలసాని మణిమ్మ, ఆమె తనయుడు, ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బలసాని కిరణ్‌ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. దీంతో వైద్య సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టారు.


ఇది తమ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా తప్పక చేయాల్సి వచ్చిందని వైద్యాధికారులు అసహనం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజానీకం వ్యాక్సిన్‌ కోసం గంటలకొద్దీ లైన్‌లో నిలబడి ఇబ్బందులు పడుతుంటే.. వైసీపీ నేతలు ఇలా తమ అనుచరుల కోసం కేంద్రాలు ఏర్పాటు చేయడం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ధోరణి వలన సామాన్య ప్రజలకు వ్యాక్సినేషన్‌ అందించడం కష్టంగా మారుతుందని వైద్య సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-08-25T09:15:51+05:30 IST