ఏకమైన పీఠాధిపతులు!

ABN , First Publish Date - 2021-02-05T09:10:46+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న అన్యమత ప్రచారంపై పీఠాధిపతులు, ఉత్తరాధికారులు ఏకమయ్యారు.

ఏకమైన పీఠాధిపతులు!

  • ఏపీలో హిందూ ఆలయాల దాడులపై విస్తృత చర్చ
  • ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ధర్మ పరిరక్షణ సభ
  • హాజరైన పీఠాధిపతులు, ఉత్తరాధికారులు
  • ‘రాముడి తల నరికివేత’పై తీవ్ర ఆవేదన
  • కంచి పీఠం నేతృత్వంలో త్వరలో తిరుపతిలో మహాసభ

తిరుపతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న అన్యమత ప్రచారంపై పీఠాధిపతులు, ఉత్తరాధికారులు ఏకమయ్యారు. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పొన్పాడి గ్రామం శివారులోని కంచిపీఠానికి చెందిన ఓ ఆశ్రమంలో బుధవారం రాత్రి సనాతన ధర్మ పరిరక్షణ పేరిట సదస్సు జరిగింది. ఏపీ, తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. దక్షిణాదిన హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశ వివరాలను గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి కమలానంద భారతి స్వామి మీడియాకు వెల్లడించారు. హైందవ సమాజానికి ధైర్యాన్నిచ్చేలా సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ప్రతినిధి గౌరీశంకర్‌, హంపీ విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యారణ్య భారతి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి, తుని సచ్చిదానం తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, అహోబిల మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి, ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎంవీఆర్‌ శాస్ర్తి, కంచి మఠం ప్రతినిధి చల్లా విశ్వనాథ శాస్త్రి తదితరులు పాల్గొన్నారన్నారు. కంచికామకోటి శంకర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా త్వరలోనే మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.


సనాతన ధర్మం, హిందూ విశ్వాసాలు, ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలను ధ్వంసం చేయడాన్ని సదస్సు తీవ్రంగా పరిగణించిందన్నారు. రామతీర్థంలో రాముడి తల ధ్వంసం చేయడం స్వామీజీలకు ఆవేదన కల్గించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అన్యమత ప్రచారం, మైనారిటీల మెప్పుకోసం హిందూ ఆలయాల ఆదాయాన్ని వినియోగించడాన్ని సదస్సు తప్పుబట్టిందని తెలిపారు. హిందూ మతాన్ని మట్టుపెట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సదస్సులో వక్తలు డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. పష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభారతి స్వామి మాట్లాడుతూ తిరుమల నుంచి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలో దేవదాయ శాఖ పనితీరు బాగోలేదన్నారు. ఆలయాల ఆదాయాన్ని సెక్యులర్‌ సంక్షేమానికి ఖర్చు చేయకూడదని తెలిపారు. మాజీ న్యాయమూర్తులు, నిపుణుల ద్వారా ఆలయాల నగలను, ఆస్తులను కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పురావస్తు శాఖ పరిధిలోని ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని కోరారు. దేవాలయాల్లో భక్త సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చెప్పారు. కాగా పొన్పాడిలో స్వామీజీలు రహస్యంగా సమావేశమయ్యారన్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-05T09:10:46+05:30 IST