మోదీ.. మీ మంచితనం దేశానికి మంచిది కాదు: ఉండవల్లి
ABN , First Publish Date - 2021-04-04T23:29:18+05:30 IST
ప్రధాని మోదీ మంచితనాన్ని భరించే శక్తి ప్రజలకు లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: ప్రధాని మోదీ మంచితనాన్ని భరించే శక్తి ప్రజలకు లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘మీరు నిజాయితీ పరులు. మీ మంచితనం దేశ ప్రజలకు మంచిది కాదు. గత ఆరేళ్లలో అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఒక్క రూపాయి బాకీ తీర్చలేదు. అసలా డబ్బులు ఎటుపోతున్నాయో తెలుసా? అవనీతిపరుడినైనా సహించొచ్చు.. కానీ అసమర్థుడిని సహించలేం. అసమర్థుడు వ్యవస్థను నాశనం చేస్తాడు’’ అని ఉండవల్లి అన్నారు.
‘‘2020 లెక్క ప్రకారం 63 భారతీయుల దగ్గర 24 లక్షల 42 వేల 213 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది 2018-2019 నాటి దేశ బడ్జెట్. సామ్యవాద ప్రభుత్వం అనుకుంటున్నా.. ఇంత డబ్బు కొంతమంది చేతుల్లో ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. రేపు పెట్టబడిదారి వ్యవస్థలోకి వెళితే... దేశం సొమ్మంతా ఎటుపోతుందో ఊహించుకోవచ్చు. 1950 - 2014 వరకు 42 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండగా, ఈ ఆరేళ్లలో అది ఒక కోటీ ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. పెట్రోలు ధరల గురించి అడిగితే గత ప్రభుత్వాల చేసిన పాపాలు అంటున్నారు. అవి తీర్చారా అంటే అదీ లేదు. అప్పులు కొత్తగా చేశావు... వాటిని ఏం చేశావో తెలియదు’’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.