తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన టికెట్‌ రూ. కోటి

ABN , First Publish Date - 2021-12-19T08:17:28+05:30 IST

తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన టికెట్‌ రూ. కోటి

తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన టికెట్‌ రూ. కోటి

25 ఏళ్లపాటు ఏడాదికి ఒకరోజు ఆరుగురికి సేవాభాగ్యం 

టీటీడీకి 600 కోట్లు ఆదాయం.. ఈ నిధులు చిన్న పిల్లల ఆస్పత్రికి

తిరుమల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి ఉదయాస్తమాన సేవా టికెట్‌ ధర సాధారణ రోజుల్లో అయితే కోటి రూపాయలు. శుక్రవారం అభిషేకం, మేల్‌ఛాట్‌ వస్త్రం సేవలు ఉన్న క్రమంలో టికెట్‌ ధర రూ.1.5 కోట్లు. శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్‌ ధరలను టీటీడీ ఈ మేరకు నిర్ణయించింది. తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయాన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు టీటీడీ స్థలాన్ని గుర్తించింది. శాశ్వత ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని, దీనికోసం ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్లు కేటాయించాలని ఈ నెల 11వ తేదీ జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఈ టికెట్లు కలిగిన భక్తులు ఏడాదిలో ఒక్కరోజు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. గతంలో సాధారణ రోజులకు సంబంధించి ఒక టికెట్‌ (ఆరుగురికి) రూ.లక్ష, శుక్రవారం రోజుకు రూ.5 లక్షలకు విక్రయించేవారు. ఈ క్రమంలో ఉదయాస్తమాన సేవా టికెట్లు పొందిన భక్తుల సంఖ్య అధికం కావడంతో 2006 నుంచి విక్రయాలను నిలిపివేశారు. అయితే వివిధ కారణాలతో కొన్ని టికెట్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని కాలపరిమితి పూర్తికావడంతో దాదాపు 531 టికెట్ల వరకూ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన ధర్మకర్తల మండలి వాటి ధరను రూ.కోటిగా, శుక్రవారం రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు. ఈ టికెట్లు కొనుగోలు చేసే భక్తులు దాదాపు 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఒక్కరోజు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు జరిగే ఆర్జితసేవల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టికెట్ల కేటాయింపులో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ బేస్‌ కింద ఈ టికెట్లను కేటాయించనున్నారు. వీటి ద్వారా టీటీడీకి దాదాపు రూ.600 కోట్లు లభించనుంది. ఈ మొత్తంతో చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాకపోతే ఈ అంశాలన్నింటిపై టీటీడీ అధికార ప్రకటన చేయాల్సి ఉంది. 

Updated Date - 2021-12-19T08:17:28+05:30 IST