బ్లాక్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు

ABN , First Publish Date - 2021-10-29T09:24:39+05:30 IST

బ్లాక్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు

బ్లాక్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు

అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వెబ్‌సైట్లు


తిరుమల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ వెబ్‌సైటు నిర్వాహకులు టీటీడీ డైరీలను, క్యాలెండర్లను అధిక ధరకు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటన గురువారం వెలుగుచూసింది. వచ్చే ఏడాదికి సంబంధించి 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు లక్ష, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీపద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు.. శ్రీవారు-పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. వీటిని ఈ నెల 11వ తేదీన బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. మొదట వీటిని తిరుమల, తిరుపతిల్లోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో, తర్వాత ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో తీసుకువచ్చారు. అయితే టీటీడీ ఇంకా ఆన్‌లైన్‌లోకి ఈ డైరీలను, క్యాలెండర్లను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో దేవుళ్లు.కామ్‌ అనే వెబ్‌సైట్‌ నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో రూ.130 ధర కలిగిన డైరీని రూ.243, రూ.130 ధర కలిగిన క్యాలెండర్‌ను రూ.198కి విక్రయానికి పెట్టారు. డైరీలకు, క్యాలెండర్లకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునే ఆలోచనతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమాలకు తెరతీశారు. అయితే ఈ విషయం బయటకి పొక్కి మీడియాలో వార్తలు రావడంతో గురువారం సాయంత్రానికి వెబ్‌సైట్‌ నుంచి టీటీడీ డైరీలు, క్యాలెండర్ల విక్రయాలను తొలగించారు. మరికొన్ని వెబ్‌సైట్లు కూడా టీటీడీ డైరీలను, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో అధిక ధరకు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది. టీటీడీ సమాచార కేంద్రాల నుంచి వెబ్‌సైట్‌ నిర్వాహకులు డైరీలను, క్యాలెండర్లను కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. గతేడాది డిసెంబరు నెలలోనూ బాలాజీప్రసాదం.కామ్‌ అనే వెబ్‌సైట్‌ నిర్వాహకులు శ్రీవారి లడ్డూప్రసాదాన్ని విక్రయిస్తోందనే సమాచారంతో టీటీడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-10-29T09:24:39+05:30 IST