29 నుంచి TTDలో ఈఎం బుక్‌ వినియోగం

ABN , First Publish Date - 2021-11-18T11:58:15+05:30 IST

టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో జరుగుతున్న పనులను నమోదు చేసే..

29 నుంచి TTDలో ఈఎం బుక్‌ వినియోగం

తిరుపతి : టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో జరుగుతున్న పనులను నమోదు చేసే ఎలకా్ట్రనిక్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఈ.ఎం బుక్‌)ను ఈనెల 29 నుంచి  అమల్లోకి తేవాలని టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఎం బుక్‌ డిజిటలైజేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగాల్లో అమలు చేయటం ఎంత కష్టసాధ్యమో ఇంజనీర్ల బాధను  ఈనెల 3న ఆంధ్రజ్యోతి ప్రచురించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మొదట తిరుమల, తిరుపతిలో మాత్రం ఈ ఎం బుక్‌ నమోదును ప్రయోగాత్మకంగా నిర్వహించాలని ఈవో ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బుధవారం రాత్రి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన క్రమంలో వచ్చే సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. 


ఇప్పటి వరకు ఇంజనీరింగ్‌ సిబ్బందికి ట్యాబులు అందని విషయం కూడా చర్చకు వచ్చింది. వెంటనే ఏఈలకు, డీఈలకు ట్యాబులు, కీ బోర్డులు ఇవ్వాలని, మలివిడతలో ఈఈలకు, ఎస్‌ఈలకు ఇవ్వాలన్నారు. ఈ ఎం బుక్‌ వల్ల క్షేత్రస్థాయిలో ఏ పనులు ఎంత వరకు వచ్చిందనే వివరాలను అందరూ తెలుసుకోవటానికి వీలవుతుందన్నారు. మాన్యువల్‌గా ఎం బుక్‌లను మోసుకు తిరిగే భారం తగ్గుతుందని, సమాచారం కూడా భద్రంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈలు సత్యనారాయణ, వెంకటేశ్వరులు, అదనపు ఎఫ్‌ఏ సీఏవో రవి ప్రసాద్‌, ఐ.టి. విభాగాధిపతి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-18T11:58:15+05:30 IST