వర్షాల కారణంగా రాని భక్తులకు వెసులుబాటు

ABN , First Publish Date - 2021-11-23T09:35:36+05:30 IST

భారీ వర్షాల కారణంగా తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

వర్షాల కారణంగా రాని భక్తులకు వెసులుబాటు

  • టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడి

తిరుమల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు దర్శన టికెట్లు ఉండి రాలేకపోయిన భక్తులు రానున్న ఆరునెలల్లో ఎప్పుడైనా దర్శనానికి రావచ్చన్నారు. దీనికోసం నూతన టికెట్లు పొందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్‌, శ్రీవాణి ట్రస్టు భక్తులకు ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. గదులను కూడా ఇదే విధానంలో తిరిగి పొందవచ్చన్నారు. వీరు ఈనెల 30వ తేదీలోపు వస్తే దర్శనానికి అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చేవారు పాత టికెట్‌ నెంబరును ఎంటర్‌ చేసి.. కావాల్సిన తేదీ, స్లాట్‌లో నూతన టికెట్‌ పొందవచ్చన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ రెండ్రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వర్షాలకు తిరుమలలో రెండు, మూడు ప్రదేశాల్లో మాత్రమే నష్టం జరిగిందని ధర్మారెడ్డి తెలిపారు. భక్తులు నిర్భయంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చన్నారు. శ్రీవారిమెట్టు మెట్లమార్గంలో భారీ వర్షానికి నాలుగు ప్రాంతాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ఈ మార్గాన్ని మూసివేస్తామని, అలిపిరి మెట్ల మార్గంలో ఎలాంటి సమస్య లేదన్నారు.  

Updated Date - 2021-11-23T09:35:36+05:30 IST