సత్యానిదే అంతిమ విజయం: బాబు
ABN , First Publish Date - 2021-01-20T08:00:04+05:30 IST
న్యాయం, ధర్మం, సత్యం ఎల్లప్పుడూ సజీవమని.. వాటిని కప్పిపెట్టడం అసాధ్యమని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘నిజాన్ని కప్పిపెట్టడం, న్యాయాన్ని నిందించడం, ధర్మానికి ద్రోహం చేయడం మహా ఘాతుకం.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టే చెప్పింది: చంద్రబాబు
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): న్యాయం, ధర్మం, సత్యం ఎల్లప్పుడూ సజీవమని.. వాటిని కప్పిపెట్టడం అసాధ్యమని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘నిజాన్ని కప్పిపెట్టడం, న్యాయాన్ని నిందించడం, ధర్మానికి ద్రోహం చేయడం మహా ఘాతుకం. సత్యానిదే అంతిమవిజయం. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ దుష్ప్రచారం చేశారు. తమకు అన్యాయం జరిగిందని అమ్మిన వారెవరూ ఫిర్యాదు చేయలేదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని న్యాయస్థానం పేర్కొనడమే నిదర్శనం’ అని మంగళవారం టీడీపీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.
గూండాలకు అడ్డాగా రాష్ట్రం: చంద్రబాబు
ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్: మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటికి వెళ్లి కొడతానని బెదిరించిన మంత్రి కొడాలి నానీని అరెస్టు చేయాల్సింది పోయి దేవినేని ఉమాను ఎలా అరెస్టు చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. జగన్ పాలనలో రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక ఎమ్మెల్యే ఎస్పీని బెదిరిస్తే మరో మంత్రి దాడులకు పాల్పడతామంటూ మాట్లాడుతున్నారు. దేవినేని ఉమా శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్టు చేయడం అక్రమం. భౌతిక దాడులకు దిగుతామన్న వారిపై ఏ చర్యా తీసుకోకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం పౌర హక్కులను ఉల్లంఘించడమే. జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే వైసీపీ నేతలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు మంత్రి బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన మంత్రి కొడాలి నాని, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా, దేవినేని ఉమాకు అండగా నిలిచి పోరాడిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌రెడ్డి తానే తలదించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్, ఫేస్‌బుక్ వేదికగా ఒపీనియన్ పోల్ నిర్వహించారు. నాలుగు ఆప్షన్లు ఇచ్చి అభిప్రాయం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి తనపై ఉన్న 31కేసుల విచారణ జాప్యానికి? రివర్స్ టెండరింగ్‌లో బాబాయ్ మర్డర్‌ని గుండెపోటుగా చిత్రించేందుకు, 3 రాజధానుల పేరుతో అమరావతిని అంతం చేయడానికి, ఆలయాలపై జగన్‌రెడ్డి చేసిన దండయాత్ర ఆధారాలు బయటపెట్టొద్దని వేడుకోవడానికి.. అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.
‘గుడివాడ వీధి కుక్క నాని’
‘‘గుడివాడ వీధి కుక్క కొడాలి నాని. మంత్రి పదవి ఇస్తే ఆ పని చేయడం చేతగాక చెరువు గట్ల మీద పేకాట క్యాంపులు పెట్టించి డబ్బులు దండుకునే పనికిమాలిన సన్నాసి. మా పార్టీ నేతల గురించి మాట్లాడటమా? పోలీసులను అడ్డుపెట్టుకొని దాక్కొంది చాలక మళ్లీ సవాళ్లా’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. ‘‘టీడీపీ భిక్షతో ఎమ్మెల్యేవైన నువ్వు ఇప్పుడు అవాకులు, చెవాకులు పేలుతున్నావు’’ అని మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఏలూరులో విరుచుకుపడ్డారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని నానా యాగీ చేసిన సీఎం జగన్ హైకోర్టు తీర్పుకు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
జగనన్న 3 ముక్కలాట... జగనన్న గుండాట...
‘‘ఆలయాలు, విగ్రహాల ధ్వంసంపై అసలు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయండి. అధికార పార్టీ నేతలు, తాడేపల్లి దొరల ఆలోచనలు అమలు చేయకుండా రాజ్యాంగ విధానం అమలు చేసి మత సామరస్యాన్ని కాపాడండి. ప్రజల్లో అశాంతిని తొలగించండి’’ అని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డీజీపీకి లేఖ రాశారు. సంక్రాంతి సందర్భంగా.. జగనన్న 3 ముక్కలాట, జగనన్న గుండాట, జగనన్న కోడిపందాలతో వైసీపీ నేతలు ప్రజలను గుల్ల చేశారని ఎద్దేవా చేశారు.
డీజీపీ పెద్ద నేరం చేస్తున్నారు
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆధారాలు లేకుండా రాజకీయ పార్టీలపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తూ, ప్రతిపక్షాలపై నిందలేయడం ద్వారా డీజీపీ పెద్ద నేరం చేశారని మండిపడ్డారు. కాగా, దేవినేని ఉమా అరెస్టును అడ్డుకున్న మహిళలపై పోలీసులు దాడి చేయడాన్ని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. మంత్రి కొడాలి నానిని అదుపు చేయడం చేతకాని సీఎంకు మహిళలపై పోలీసులతో జులం చేయించే అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు.