జగన్ వద్ద పలుకుబడి ఉన్న నేత నుంచి ఎమ్మెల్యే రోజాకు సపోర్ట్.. అందుకే ఆమె డోంట్‌కేర్ అంటున్నారట!
ABN , First Publish Date - 2021-12-26T17:47:02+05:30 IST
పాలిటిక్స్‌లో ఆమె స్టైలే వేరు. ప్రతిపక్షం కంటే ఎక్కువగా సొంత పార్టీలోని అసమ్మతి నేతల నుంచి ఆమెకు నిత్య విమర్శలు తప్పడం లేదు.

పాలిటిక్స్‌లో ఆమె స్టైలే వేరు. ప్రతిపక్షం కంటే ఎక్కువగా సొంత పార్టీలోని అసమ్మతి నేతల నుంచి ఆమెకు నిత్య విమర్శలు తప్పడం లేదు. కార్యక్రమం ఏదైనా సరే నియోజకవర్గంలో పోటీపడి పోగ్రామ్స్ పెట్టడంలో వ్యతిరేకవర్గం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే సొంత పార్టీ నేతల అసమ్మతిని డోంట్ కేర్ అంటున్న ఆమె..పవర్ పంచ్‌లేస్తూ ఏమాత్రం తగ్గడం లేదు. జబర్దస్త్‌గా ముందుకుపోతున్న ఆ నేతను వెనకుండి సపోర్ట్ చేస్తోందెవరు? తన వాయిస్‌ను బలంగా వినిపించేందుకు ఆమె ప్రయోగిస్తున్న అస్త్రం ఏంటి? ఏబీఎన్-ఇన్సైడ్ స్టోరీలో తెలుసుకుందాం...
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఠక్కున గుర్తొచ్చేది ఎమ్మెల్యే రోజా. అయితే స్థానిక రాజకీయాలు గమనించే వారికి రోజా కంటే ఎక్కువగా అక్కడి అసమ్మతి పాలిటిక్సే మదిలో మెదిలేలా పరిస్థితులు కనిపిస్తుంటాయనడంలో అతిశయోక్తిలేదు. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో రోజా గ్రూప్ వర్సెస్ అమె అసమ్మతి వర్గాలమధ్య జరిగిన వార్ నగరి వైసీపీ వర్గపోరును మరోసారి తట్టిలేపిందనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యే ఆర్ కే.రోజా, ఆమె ప్రత్యర్థి వర్గం చక్రపాణిరెడ్డి, కేజే శాంతి, కేజే కుమార్‌లు పోటాపోటీగా వేడుకలు నిర్వహించడం, ఫ్లెక్సీలు చింపుకోవడం వంటివి పార్టీలో ఇన్నర్టాక్ను క్రియేట్ చేస్తున్నాయి.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రిపదవి కోసం తీవ్రంగానే ట్రై చేశారు. అయితే స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు అమాత్యయోగం దక్కలేదు. పైగా నియోజకవర్గంలోనే ఆమెపై అసమ్మతికి ఆజ్యంపోస్తూవస్తున్నారని జిల్లా నేతలపై ఆమె సందర్బం వచ్చినప్పుడల్లా తన ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అసమ్మతులను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాల్సిన రోజా.. ఫైర్‌బ్రాండ్‌గా వారిపై పంచ్‌లేస్తూ డోంట్‌కేర్ అంటున్నారు. ఏ ధైర్యంతో ఆమె అసంతృప్తులను లైట్ తీసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు నగరిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలోని కీలకనేతల మదిని తొలుస్తోంది. ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర మంచి పలుకుబడి ఉన్న నేత సపోర్ట్ ఉందనే ప్రచారం ఈ మధ్య ఎక్కువైపోయింది. ఆయన సలహాలు, సూచనలను ఆధారంగా చేసుకునే రోజా ధైర్యంగా అసమ్మతివాదులపై పైచేయి సాధించేలా, నియోజకవర్గంపై పట్టుసాధించేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
కీలకనేత సలహాలు, సూచనలతో ముందుకుపోతున్న రోజా ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు మీడియా కవరేజీని కూడా ఓ అస్త్రంగా వాడుకుంటున్నట్లు టాక్ వస్తోంది. జగన్ రెడ్డిని పొగడ్తలతో ముంచేత్తే రోజా తన నగరి నియోజకవర్గంలో మాట్లాడితే అంతగా ప్రచారం రాదని భావించి తిరుమల కొండను తన రాజకీయ ప్రచారానికి వేదికగా మల్చుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోజా తిరుమల వచ్చారంటే నగరి రాజకీయలు మాట్లాడేందుకే, లేదంటే జగన్ రెడ్డిని పొగిడేందుకే అన్నట్లు పరిస్థితి తయారైందని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. రోజా తిరుమల పర్యటనను స్వామికార్యం, స్వకార్యం తీర్చుకునేలా ఉపయోగించుకుంటుందని వైసీపీ సర్కిల్స్‌లో వినబడే మాటలు. నియోజకవర్గంలో తనవర్గం వారికి పదవులు దక్కేలా చేసుకుంటున్న రోజా పట్టు కోల్పోకుండా చేసుకుంటున్నారు. తన అవసరం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, నియోజకవర్గంలో మండలస్థాయి నేతల ప్రభావం పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని హైకమాండ్ గుర్తించిందని రోజా బలంగా నమ్ముతున్నట్లు టాక్ వస్తోంది.