తిరుపతి ఉప ఎన్నికలో..శిశుపాల వధ జరగాలి!

ABN , First Publish Date - 2021-01-20T08:17:57+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో శిశుపాల వధ జరగాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. ‘శిశుపాలుడు చేసిన తప్పులు లెక్కగట్టి వంద పూర్తికాగానే శ్రీకృష్ణుడు శిరచ్ఛేదం చేశాడు

తిరుపతి ఉప ఎన్నికలో..శిశుపాల వధ జరగాలి!

 • వైసీపీ పతనం అక్కడి నుంచే ఆరంభం
 • శిశుపాలుడివి నూరు తప్పులే.. జగన్‌వి వందల తప్పులు
 • ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు.. రాష్ట్ర చరిత్రలోనే లేవు
 • తిరుమల పవిత్రతను దిగజార్చారు
 • ఇళ్ల స్థలాల్లో కోట్లు మింగారు
 • పింఛను 3 వేలిస్తామని
 • 250 మాత్రమే పెంచారు
 • రైతు భరోసా 6 వేలు ఎగ్గొట్టారు
 • 20 నెలల్లో ఒక్క పరిశ్రమా తేలేదు
 • ఇలాంటి పార్టీకి ఓటేస్తారా?
 • తెలుగుదేశం లౌకిక పార్టీ..
 • ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సహించదు
 • చంద్రబాబు స్పష్టీకరణ
 • తిరుపతి టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌


అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో శిశుపాల వధ జరగాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. ‘శిశుపాలుడు చేసిన తప్పులు లెక్కగట్టి వంద పూర్తికాగానే శ్రీకృష్ణుడు శిరచ్ఛేదం చేశాడు. ఇప్పుడు జగన్‌ రెడ్డి తప్పులు ఇరవై నెలల్లో వందలాదిగా జరిగాయి. ఆ తప్పులకు తిరుపతి ప్రజలు తగిన శిక్ష వేయాలి. వైసీపీ పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి’ అని అన్నారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని టీడీపీ గ్రామస్థాయి నేతలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు పేరుతో వేల కోట్లు మింగిన పార్టీకి ఎవరైనా ఓటు వేస్తారా? టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను కూడా పేదలకు ఇవ్వకుండా ఏడిపిస్తున్న పార్టీకి ఓటేస్తారా? ముంపు భూముల్లో, శ్మశానాల్లో, ఊళ్లకు దూరంగా ఎక్కడో విసిరేసినట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చిన పార్టీకి వేస్తారా? అధికారంలోకి రాగానే పింఛను రూ.3 వేలు చేస్తామని చెప్పి కేవలం రూ.250 పెంచిన పార్టీకి వేస్తారా? మీటర్లు పెట్టే పార్టీకి రైతులు ఓటేస్తారా? రైతు భరోసా రూ.6 వేలు, ఉద్యానవన సబ్సిడీలు ఎగ్గొట్టిన పార్టీకి ఓటేస్తారా? 20 నెలల్లో ఒక్క పరిశ్రమ తేలేని పార్టీకి యువత ఓట్లేస్తారా? అత్యాచారాల రాష్ట్రంగా మార్చిన పార్టీకి మహిళలు ఓటు వేస్తారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు చేసి వేధించుకు తింటున్న పార్టీకి ఆ వర్గాల వారు ఓటేస్తారా? ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చకు పెట్టాలి.


వారిలో చైతన్యం తీసుకురావాలి’ అని పార్టీ నేతలను కోరారు. దేశదేశాలూ తిరిగి తిరుపతి, నెల్లూరుకు అనేక పరిశ్రమలు తెచ్చామని, ఇప్పుడు ఆ కంపెనీలన్నింటినీ బెదరగొట్టి తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో అడవిపల్లి రిజర్వాయర్‌, అవుకు టన్నెల్‌, సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి, సోమశిల ఎత్తిపోతల మొదటి దశ, కండలేరు ఎత్తిపోతల వంటివి పూర్తి చేశామని, వైసీపీ వచ్చాక ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా అని నిలదీయాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే..


తిరుమలలో చేయని అరాచకం లేదు..

జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో చేయని అరాచకం లేదు. రాజశేఖరరెడ్డి హయాంలో ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకుంటే ప్రజలు నిరసించారు. ఇప్పుడు భార్య బైబిల్‌ పట్టుకుని తిరిగే వ్యక్తిని టీటీడీ చైౖర్మన్‌ను చేశారు. ఒక సామాజిక వర్గం పెత్తనంగా మార్చారు. ఎస్వీబీసీ చైర్మన్‌ అసభ్య ప్రవర్తన, భక్తులకు అసభ్య వీడియో లింకులు పంపడం, ఆర్టీసీ టికెట్లపై జెరూసలేం యాత్ర విశేషాలు ముద్రించడం, తిరుమల కొండపై శిలువ గుర్తులు పెట్టడం, అక్కడ అన్యమత ప్రచారం చేయడం వంటి వాటితో తిరుమల పవిత్రతను తగ్గిస్తున్నారు.


పాస్టర్ల వ్యాఖ్యలే నిదర్శనం

రాష్ట్రంలో అధికారం అండగా బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయి. పాస్టర్ల వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. వందలాది గ్రామాలను క్రీస్తు గ్రామాలుగా మార్చానని, హిందూ విగ్రహాలను కాలితో తన్ని ధ్వంసం చేశానని ఒక పాస్టర్‌ చెబితే.. ప్రతి గంటకూ మత మార్పిళ్లు చేస్తామని మరో పాస్టర్‌ బహిరంగంగా ప్రకటించాడు. ఆలయాలపై దాడులు ఉన్మాదుల పనని ముందు రోజు చెప్పిన డీజీపీ.. ఆ మర్నాడే మాట మార్చి టీడీపీ, బీజేపీ వల్లే జరుగుతున్నాయని చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనం.


ఆ ఎస్సై ఎలా చనిపోయాడు?

గుడివాడలో మంత్రి పేకాట దందాను పట్టుకున్న ఒక ఎస్సై మరణం అనుమానం కలిగిస్తోంది. అది ఆత్మహత్యా.. హత్యా.. అనుమానాస్పద మరణమా అన్నది తేలాలి. ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు రాష్ట్ర చరిత్రలోనే లేవు. ఇరవై నెలల్లో రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 16 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 1,350 చోట్ల భౌతిక దాడులు జరిగాయి. 400 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ప్రశాంతంగా ఉండే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా కత్తులతో దాడులు పెరిగిపోతున్నాయి. భవిష్యత్‌లో తనపై పోటీ చేస్తాడన్న అక్కసుతోనే ఎమ్మెల్సీ బీటెక్‌ రవిపై తప్పుడు కేసులు పెట్టి జగన్‌రెడ్డి వేధిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీని బహిరంగ సభలో బెదిరిస్తున్నాడు. బూతుల మంత్రి ప్రతిపక్ష నాయకుల ఇంటికి వచ్చి కొడతాననడం వైసీపీ రౌడీ రాజకీయాలకు నిదర్శనం. ఇళ్ల స్థలాల్లో అవినీతిని ప్రశ్నించిన టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్యను ఆ స్థలాల్లోనే హత్య చేశారు. గండికోట పరిహారం పంపిణీలో అక్రమాలను ప్రశ్నించిన కానిస్టేబుల్‌ గురుప్రతాపరెడ్డిని ఊళ్లోనే హత్య చేశారు. రోడ్డు వేయలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త శవంగా మారాడు. పదవుల కోసం వైసీపీకి సలాం కొడుతున్న కొందరు పోలీసు అధికారుల వల్లే ఈ దుస్థితి.

Updated Date - 2021-01-20T08:17:57+05:30 IST