ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లు అరెస్టు

ABN , First Publish Date - 2021-08-21T08:51:59+05:30 IST

కడప సబ్‌ రిజిస్ట్రార్‌ అర్బన్‌, రూరల్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లను పోలీసులు అరెస్టు చేశారు.

ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లు అరెస్టు

నకిలీ చలానాలతో రూ.కోటికి పైగా స్వాహా 

రూ.67 లక్షల ఆస్తి జప్తు

 ఎస్పీ అన్బురాజన్‌ 

కడప(క్రైం), ఆగస్టు 20: కడప సబ్‌ రిజిస్ట్రార్‌ అర్బన్‌, రూరల్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం  విలేకరులకు ఎస్పీ అన్బురాజన్‌ కేసు వివరాలు వెల్లడించారు. కడప అక్కాయపల్లెకు చెందిన జింకా రామకృష్ణ, అనమల లక్ష్మీనారాయణ, అతని కుమారుడు గురుప్రకాశ్‌ కడప రూరల్‌, అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లుగా పనిచేస్తున్నారు. సీఎ్‌ఫఎంఎ్‌సలో లోపాలను ఆసరాగా చేసుకుని రిజిస్ర్టేషన్లకు సంబంధించిన పన్నుల డబ్బు వినియోగదారుల నుంచి వసూలుచేసి, ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా తక్కువ మొత్తానికి చలానా నంబరు క్రియేట్‌ చేసేవారు. కంప్యూటర్‌ యాప్‌ సహాయంతో రిజిస్ట్రేషన్‌ మొత్తానికి సరిపోయే చలానాను ఫోర్జరీ చేసి డాక్యుమెంట్‌తో కలిపి ఇచ్చి మోసగించేవారు.


ఈ నెల 2న ఒక చలానా నంబరు తప్పుపడటంతో సబ్‌రిజిస్ట్రార్‌ చెల్లదని చెప్పారు. వెంటనే అదే నంబరుపై మరో చలానా ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై 4న రిమ్స్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ డి.సునీల్‌ ఆధ్వర్యంలో విచారించి మోసం చేసినట్టు గుర్తించారు. కడప అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో 289 నకిలీ చలానాలతో 95 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేసి రూ.46,78,628, రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో 509 నకిలీ చలానాలతో 146 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ద్వారా రూ.56,47,860 కలిపి మొత్తం రూ.1,03,26,488 స్వాహా చేసినట్లు ఎస్పీ వివరించారు. ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లను అరెస్టుచేసి వారికి సంబంధించిన రూ.67లక్షల విలువైన ఆస్తిని జప్తుచేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-21T08:51:59+05:30 IST