TPT : చిన్నపిల్లల అశ్లీల వీడియోలు అప్‌లోడ్ చేసిన ముగ్గురి అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-25T12:28:04+05:30 IST
సైబర్ నేరస్తులను ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు స్పష్టం చేశారు.

- తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్షలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ
తిరుపతి : సైబర్ నేరస్తులను ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు స్పష్టం చేశారు. చిన్నపిల్లల అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌చేసిన ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. నిందితులను మంగళవారం ఆయన మీడియాకు చూపించి.. వివరాలు వెల్లడించారు. చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని అరికట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ క్రమంలో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ప్లోయిడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)తో కలిసి రాష్ట్ర పోలీసు శాఖ పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు. ఎన్‌సీఎంఈసీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను పర్యవేక్షిస్తూ ఉంటుందన్నారు.
చిన్నపిల్లలకు సంబంధించి అశ్లీల వీడియోలను ఎవరైనా అప్‌లోడ్ చేసినా, సర్క్యులేట్ చేసినా సీఐడీకి సమాచారం ఇస్తుందన్నారు. వారి ద్వారా సంబంధిత జిల్లా పోలీసులకు సమాచారం వస్తుందన్నారు. అలా సీఐడీ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా సైబర్‌క్రైమ్ సిబ్బంది కొంతకాలంపాటు దర్యాప్తు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేసినందుకు ఆరు కేసులు నమోదు చేసి, మొత్తం 30 మందిని గుర్తించామని వివరించారు. వీరిలో చాలామంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో వారి వివరాలను ఆయా ప్రదేశాల పోలీసులకు ఇచ్చామన్నారు. తిరుపతి పరిధిలో ఆరుగురిని గుర్తించగా, ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు.
సైబర్ నిందితులు వీరే..
తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన కె.సాయిశ్రీనివాసులు (30) ఎలక్ట్రిక్ వర్క్ చేస్తుంటాడు. గతేడాది 8 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. తిరుచానూరు ముత్తునగర్‌కు చెందిన సి.మునికమల్(22) బీటెక్ చేశాడు. ఇతడూ 2020లో 16 వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఇక, తిరుచానూరు లక్ష్మీనగర్‌కు చెందిన కె.కిషోర్‌బాబు(28) ప్రొవిజన్ స్టోర్ నడుపుతున్నాడు. గత ఏడాదినుంచి ఏడు వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఈ ముగ్గురిని గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశామని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై పోక్సో చట్టంకింద కూడా కేసులు నమోదు చేశామని, రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ ఇచ్చిన డొమైన్ అడ్రస్‌లను పట్టుకుని దర్యాప్తుచేసి నిందితులను గుర్తించిన సైబర్‌క్రైమ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఎక్కడున్నా అరెస్ట్ చేస్తాం..
సైబర్ నేరస్తులు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెంకటఅప్పలనాయుడు స్పష్టం చేశారు. అప్‌లోడ్ చేసిన వీడియోలను, ఫొటోలను డిలీట్‌చేసేస్తే పట్టుకోలేరని అనుకోవద్దన్నా రు. ఒకసారి అప్‌లోడ్ చేశాక, డిలీట్‌చేసినా నిందితులను గుర్తిస్తామన్నారు. విద్యార్థులు, యువకులు, ఇంటర్నెట్ వినియోగించే వారందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి సైబర్ నేరాలు తెలిసి చేసినా, తెలియక చేసినా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో దిశ డీఎస్పీ రామరాజు, సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి, సైబర్‌క్రైమ్ సిబ్బంది శ్రీనివాసులు, కార్తీక్, పార్థసారధి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.