ఆ వివరాలు ‘సంగం’ ఆవరణ దాటరాదు

ABN , First Publish Date - 2021-05-08T08:49:45+05:30 IST

కేసుతో సంబంధం లేని సంగం డెయిరీ మార్కెటింగ్‌, పాల ఉత్పత్తిదారుల వివరాలను దర్యాప్తు అధికారులు, వారి సహాయకులు కంపెనీ ఆవరణ నుంచి బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది

ఆ వివరాలు ‘సంగం’ ఆవరణ దాటరాదు

మార్కెటింగ్‌, పాల ఉత్పత్తిదారుల డేటాను బయటకు తీసుకెళ్లొద్దు

ఏసీబీ అధికారులకు హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ జూన్‌ 17కి వాయిదా


అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): కేసుతో సంబంధం లేని సంగం డెయిరీ మార్కెటింగ్‌, పాల ఉత్పత్తిదారుల వివరాలను దర్యాప్తు అధికారులు, వారి సహాయకులు కంపెనీ ఆవరణ నుంచి బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. కంపెనీ ప్రయోజనాలకు భంగం కలిగించవద్దని స్పష్టం చేసింది. చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఎండీ పి.గోపాలకృష్ణన్‌ల కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కరోనా నేపథ్యంలో దర్యాప్తు నిలుపుదల చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్ధనను తోసిపుచ్చింది. దర్యాప్తుతో పాటు ఇతర అంశాలకు సంబంధించి పిటిషనర్‌కు ఉన్న అభ్యంతరాలను ఏసీబీ కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునంధనరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. 


కోర్టు ఆదేశించినా కౌంటర్‌ వేయలేదు..

నిందితులకు కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘గత 15 రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఏసీబీ కౌంటర్‌ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వండి. ఏసీబీ అధికారులు బయట వ్యక్తులను తీసుకొచ్చి.. పాల ఉత్పత్తిదారులు, మార్కెటింగ్‌కి సంబంధించిన డేటాను స్వాధీనం చేసుకుంటున్నారు. వందల మంది సిబ్బందితో పోలీసుల తనిఖీల వల్ల దాదాపు వంద మంది ఉద్యోగులకు కరోనా సోకింది. అందుచేత దర్యాప్తును నిలువరిస్తూ ఆదేశాలివ్వండి’ అని అభ్యర్థించారు. ఏసీబీ తరఫు న్యాయవాది గాయత్రీ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. దర్యాప్తును నిలువరిస్తే ఆధారాలు సేకరించలేమన్నారు. ప్రతి రోజూ విచారణ ముగిశాక అధికారులు పంచనామా అందజేస్తున్నారని వివరించారు. వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేయాలని కోరారు.

Updated Date - 2021-05-08T08:49:45+05:30 IST