ఆ వ్యాఖ్యలకే ఈ రియాక్షన్‌

ABN , First Publish Date - 2021-10-21T08:38:02+05:30 IST

‘‘పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తే రియాక్షన్‌ ఎలా ఉంటుందో మనం చూశాం. రాష్ట్రానికి హెరాయిన్‌తో సంబంధం లేదని పదే పదే చెబుతున్నా, పద్ధతి ప్రకారమే బురద చల్లుతున్నారు’’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వ్యాఖ్యానించారు.

ఆ వ్యాఖ్యలకే ఈ రియాక్షన్‌

  • పద్ధతి ప్రకారమే డ్రగ్స్‌పై బురద
  • హద్దు దాటి సీఎంపైనే అసభ్య వ్యాఖ్యలు
  • దాని పర్యవసానాన్నే చూస్తున్నాం 
  • దాడులపై ముందుగా తెలియదు: డీజీపీ 
  • కేసులు, వైఫల్యాలపై జవాబు దాటవేత


అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తే రియాక్షన్‌ ఎలా ఉంటుందో మనం చూశాం. రాష్ట్రానికి హెరాయిన్‌తో సంబంధం లేదని పదే పదే చెబుతున్నా, పద్ధతి ప్రకారమే బురద చల్లుతున్నారు’’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వ్యాఖ్యానించారు. తమ కార్యాలయానికి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదన్నారు. బాధ్యుల అరెస్టు, పోలీసు వైఫల్యాలపై సమాధానం దాటవేసిన డీజీపీ...రాష్ట్రంలో శాంతిభధ్రతలు అదుపులో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏటా నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం(అక్టోబరు 21) సందర్భంగా పోలీసు సంక్షేమం, భద్రత ఇతర అంశాలపై మంగళగిరి పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో గత నెలలో హెరాయిన్‌ పట్టుబడినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో జరుగుతోందంటూ ప్రతిపక్షం బురద జల్లుతోంది.


విజయవాడ అడ్రస్‌ మినహా ఇంకేమీ లేదని నేనూ, డీఆర్‌ఐ స్పష్టంగా వెల్లడించినా పదేపదే ఓ పద్ధతి ప్రకారం ఆరోపణలు చేస్తున్నారు. అవి హద్దులు దాటి రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపైనే అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసేదాకా వెళ్లాయి. దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూస్తున్నాం’’ అని డీజీపీ అన్నారు. మాటలు హద్దులు దాటితే దాడులు చేయడం సమంజసమంటారా అని విలేకరులు ప్రశ్నించగా, తాను అలా అనడంలేదని, దాడులు జరగడం దురదృష్టకరమని బదులిచ్చారు. 


‘మీకే నేరుగా ఫోన్‌ చేస్తే స్పందించక పోవడం ఏంట’ని ప్రశ్నించగా, గుర్తు తెలియని నంబర్‌ నుంచి తనకు మంగళవారం సాయంత్రం 5.03 గంటలకు ఫోన్‌ వచ్చిందని, మరో కార్యక్రమంలో ఉండటంవల్ల స్పందించలేదని, గుంటూరు ఎస్పీ, మంగళగిరి పోలీసులు స్పందించారని డీజీపీ వివరించారు. ఏపీ గిరిజనులపై కాల్పులు జరిపిన తెలంగాణ పోలీసులపై 307 కింద కేసులు నమోదు చేస్తారా.? అని విలేకర్లు ప్రశ్నించగా, అది రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆపరేషన్‌ అంటూ.. విశాఖ డీఐజీ, ఎస్పీ వ్యాఖ్యలకు విరుద్ధంగా డీజీపీ సమాధానం ఇవ్వడం గమనార్హం. టీడీపీ కార్యాలయాలపై దాడులు, బాధ్యులపై కేసులు, పోలీసుల వైఫల్యం తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... డీజీపీ అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పరోక్షంగా సహకరించారంటూ డీజీపీపై గుంటూరు జిల్లా అమృతలూరు మండల టీడీపీ అధ్యక్షుడు యలవర్తి బ్రహ్మానందం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-10-21T08:38:02+05:30 IST