అవి ప్రభుత్వ హత్యలే!

ABN , First Publish Date - 2021-11-26T08:31:57+05:30 IST

అవి ప్రభుత్వ హత్యలే!

అవి ప్రభుత్వ హత్యలే!

62 వరద మరణాలపై న్యాయ విచారణ జరపాలి

ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా?

కష్ట సమయంలో సీఎంకు విందు వినోదాలా?

ఇసుక మాఫియా వల్లే గ్రామాలు మునిగాయి

వైఎస్‌ చనిపోతే నాలుగేళ్లు ఓదార్పు యాత్ర

కడప జిల్లాలో ఇందరు చనిపోతే ఓదార్చరా?

సాయం పెంచకుంటే ఆందోళన: చంద్రబాబు


నెల్లూరు/తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరదలతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని.. తినేందుకు తిండి కూడా లేక అల్లాడుతున్నారని.. పంటలు దెబ్బతిని రైతులు కుమిలిపోతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి సమయంలో సీఎం జగన్‌కు పెళ్లిళ్లు, విందులు, వినోదాలు కావాలా అని నిలదీశారు. ‘అసెంబ్లీలో కూర్చుని భజనపరులతో పొగిడించుకుంటున్నారు. ఈ సమయంలో అసెంబ్లీ అవసరమా? ఈ సీఎంను ఏం చేయాలి? ఇదేనా ప్రభుత్వం అంటే? వీరికి పరిపాలించే అర్హత ఉందా’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఉదయం ఆయన చిత్తూరు జిల్లా రేణిగుంటలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం రోడ్డుమార్గాన నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరు జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయేదాకా పర్యటించారు. ముందుగా ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో వరద బాధితులతో మాట్లాడారు. అక్కడ నుంచి గంగాపట్నం చేరుకుని తెగిన చెరువు కట్టను పరిశీలించారు. పూర్తిగా మునిగిపోయిన గిరిజనుల ఇళ్లను సందర్శించారు. వారిని పరామర్శించి కష్టాలు, బాధలు తెలుసుకున్నారు. ఆయా సందర్భాల్లో ఆయన బాధితులనుద్దేశించి మాట్లాడారు. వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సోమశిల జలాశయానికి 5.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో కూడా విఫలమైందన్నారు. ‘పెన్నా నదిలో ఇసుక మాఫియా తవ్వకాల కారణంగానే నెల్లూరు జిల్లాలో ఎక్కువ గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. నదిలో ఇష్టానుసరంగా ఇసుక మెట్టలను తొలగించడంతో పొర్లు కట్టలు బలహీనపడి ఎక్కడికక్కడ తెగిపోయాయి. ముందస్తు చర్యలు చేపట్టలేకపోయినా తర్వాత కూడా బాధితులను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. మా హయాంలో బాధితులకు అన్ని రకాల నిత్యావసర సరుకులతోపాటు ఒక్కో కుటుంబానికి రూ.14 వేల వరకు ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు రూ.2 వేలిచ్చి చేతులు దులుపుకొన్నారు’ అని దుయ్యబట్టారు.


అనుభవరాహిత్యం.. ప్రజలపాలిట శాపం

రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలకు మరణించిన 62 మందివీ ప్రభుత్వ హత్యలేనని, దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరముందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘సన్నద్ధత, సాయం, పునరావాసం... ఇలా అన్నింటా ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అనుభవ రాహిత్యం, అహంభావం, ప్రకృతితో ఆడుకోవడం వంటివన్నీ కలిసి ప్రజలకు శాపంగా మారాయి. కడప జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు జరిగాయి. ఈ ప్రాజెక్టుల కింద ఇసుక మాఫియా తవ్వకాల కోసం ఇటాచీలు, జేసీబీలు, టిప్పర్లు పెద్ద సంఖ్యలో ఉంచారు. ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే ఆ యంత్రాలు కొట్టుకుపోతాయని.. వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు ముంపు ప్రాంతాల నుంచి జనాన్ని బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉండగా.. అలాంటివెక్కడా జరగలేదు. యాభై ఇళ్లకు ఒకరు వంతున వలంటీరు వ్యవస్థ ఉన్నా.. వారికి ఏం సమాచారమిచ్చారో దేవుడికే తెలియాలి. మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించడం కుటుంబ బాధ్యత. అయితే శవమే దొరక్కపోతే ఆ కుటుంబం పడే క్షోభ అనుభవించే వారికే తెలుస్తుంది. తిరుపతిలో మ్యాన్‌ హోల్‌లో పడి గల్లంతైన వ్యక్తి శవం కూడా వెతికి పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. వరద ముంపునకు సంబంధించి ఎవరు ఎక్కడ విఫలమయ్యారో తేల్చడానికి న్యాయ విచారణ జరిపించాలి. ప్రాజెక్టుల నుంచి సకాలంలో నీటిని ఎందుకు విడుదల చేయలేదు.. ఎందుకు ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టలేదో విచారించి బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున 30-40 వేల మందికి సాయం చేశామని, అధికారం ఉన్న ప్రభుత్వం మాత్రం దారుణంగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేసుకోవడానికి రూ.4 వేల కోట్లు, ఆ రంగులు తొలగించడానికి రూ.2 వేల కోట్లు ఈ సీఎం ఖర్చు పెట్టారని.. అలాంటి వాటికి కాకుండా ప్రభుత్వ తప్పిదాలకు ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రజల కోసం ఖర్చు చేయాలని హితవు పలికారు.


ప్రజలు ఓట్లు వేసే యంత్రాలా..

ప్రజలను ఓట్లు వేసే యంత్రాలని అనుకుంటున్నారు తప్ప వారిని ఆదుకునే ఆలోచనే ప్రభుత్వంలో కనిపించడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు.. ఎవరు ఎలా మరణించినా వైఎస్‌ కోసమేనంటూ నాలుగేళ్లు ఓదార్పు యాత్ర చేసిన జగన్‌.. ఇప్పుడు సొంత జిల్లాలో వరదలకు ఇంతమంది చనిపోతే ఓదార్చారా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. గంగపట్నంలోని ఒక్కో గిరిజన కుటుంబానికి ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాల్లో మనిషి చనిపోతే ఎప్పటినుంచో రూ.5 లక్షల వంతున చెల్లిస్తుండగా ఆ మొత్తాన్ని పెంచలేదని చంద్రబాబు అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ చేసిన తప్పునకు జనం చనిపోతే రూ.కోటి వంతున ఇచ్చారని, అయితే ఇక్కడ వరదల్లో ప్రభుత్వ తప్పిదాలకు చనిపోతే ఏమీ ఇవ్వలేదని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల వంతున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని, సంవత్సరంపాటు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు ఇవ్వాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని తెలిపారు. 


వరి కాకుండా ఏం పండించాలి?

రైతులు వరిపంట వేయవద్దని జగన్‌ ప్రభుత్వం చెబుతోందని.. మరి వారేం పండించాలని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అందరూ మద్యం తాగమనేలా కొత్త రూల్‌ తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం తాగితేనే పింఛను, అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు ఇస్తామనేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, సోమిరెడ్డి, బీద రవిచంద్ర, అబు ల్‌ అజీజ్‌, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.


పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు భోజనం పెట్టకుండా.. అక్కడి నుంచి పంపివేసే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. విపత్తు కాలంలో ప్రజలకు తిండి పెట్టే బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదా?

ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. అలాంటప్పుడే ప్రభుత్వాల సామర్థ్యం తెలుస్తుంది. 

రాష్ట్రప్రభుత్వం తనవద్ద ఉన్న విపత్తుల నిధి నుంచి ముందుగా వరద సహాయక చర్యలకు ఖర్చు చేయాలి. తర్వాత ఆ నిధుల రీయింబర్స్‌మెంట్‌ కోసం గానీ, లేదంటే అదనపు సాయం కోసం కేంద్రాన్ని కోరాలి. అయితే ఈ ప్రభుత్వం రూపాయికూడా ఖర్చు చేయకుండానే కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరడం హాస్యాస్పదంగా ఉంది.

- చంద్రబాబు



Updated Date - 2021-11-26T08:31:57+05:30 IST