అమరావతి భూలావాదేవీల్లో అక్రమం లేదు
ABN , First Publish Date - 2021-09-03T08:26:18+05:30 IST
ఆంధ్రుల రాజధానిగా తెరపైకి వచ్చిన ‘అమరావతి’లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను హైకోర్టు విస్పష్టంగా తోసిపుచ్చింది.

- ప్రమాణం రోజునే రాజధానిపై నాటి సీఎం ప్రకటన
- ఫలానా చోట రాజధాని అని ప్రజలందరికీ తెలుసు
- పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి.. ప్రజల్లోనూ చర్చ
- అప్పట్లో దమ్మాలపాటి అదనపు ఏజీ మాత్రమే
- ఏపీ సీఆర్‌డీఏ చట్టం తేవడంలో ఆయన పాత్ర లేదు
- ‘ఇన్‌సైడర్’ లేనేలేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది
- ఏసీబీ తీరు చీకట్లో తుపాకీ పేల్చినట్లు ఉంది
- పిటిషనర్లపై ఆరోపణలు ఊహాజనితంగా ఉన్నాయి
- అమరావతి భూములపై తేల్చి చెప్పిన హైకోర్టు
- దమ్మాలపాటి తదితరులపై ఏసీబీ కేసు కొట్టివేత
భూ యజమానులే భూముల విక్రయానికి ముందుకొచ్చినట్లు దస్తావేజులు పరిశీలిస్తే తెలుస్తోంది. ఆ తర్వాత కూడా భూములు విక్రయించడంపై వాటి యజమానులు ఫిర్యాదు చేయలేదు. భూములతో సంబంధం లేని కొత్త వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం... ఆ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ డీఎస్పీ ప్రాథమిక విచారణ జరిపి, ఈ వ్యవహారాన్ని కాగ్నిజబుల్ నేరంగా పేర్కొనడం సమర్థనీయం కాదు. ఆ అభిప్రాయానికి ఎలా వచ్చారో ఊహకే అందడం లేదు.
పిటిషనర్లు నేరానికి పాల్పడ్డారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. ఊహాజనిత ఆరోపణలతో వ్యక్తులపై క్రిమినల్ దర్యాప్తు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా పిటిషనర్లపై కేసు నమోదు చేయడం లక్ష్యం లేకుండా చీకటిలో తుపాకీ పేల్చినట్లుంది. అలా జరగడం వల్ల శబ్దం, అలజడి తప్ప లక్ష్యాన్ని ఛేదించలేం.
అప్పటి సీఎంతో సన్నిహితంగా ఉన్నందున రాజధాని ఎక్కడ వస్తుందో దమ్మాలపాటికి తెలుసు.. అన్న ప్రాసిక్యూషన్ వాదనను ఆమోదించలేం. అది ఊహాజనితం. రాజధానికి సంబంధించి ప్రత్యేక సమాచారం ఆయనకు తెలుసనేందుకు ఆధారాలు లేవు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో సైతం రాజధాని ఏర్పాటు ప్రక్రియలో దమ్మాలపాటి పాత్ర ఉందని పేర్కొనలేదు. అందువల్ల బంధువులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి భూములు కొనుగోలు చేయించి ఉంటారనే ప్రశ్న ఉత్పన్నం కాదు.
- హైకోర్టు
అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల రాజధానిగా తెరపైకి వచ్చిన ‘అమరావతి’లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను హైకోర్టు విస్పష్టంగా తోసిపుచ్చింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేసింది. వీరిపై మోపిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(డి)(2), ఐపీసీ 409, 420 రెడ్ విత్ 120బి సెక్షన్లు ఇక్కడ చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఈ సంచలన తీర్పు చెప్పారు. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ పేరిట దమ్మాలపాటి శ్రీనివాసరావుతోపాటు మరికొందరిపై ఏసీబీ గత ఏడాది సెప్టెంబరు 15న కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపి వేస్తు గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత దానిని ఉపసంహరించుకుని... హైకోర్టులోనే కౌంటరు దాఖలుచేసింది. ఇప్పుడు... ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో ఇదే ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో కొందరు వ్యక్తులపై పెట్టిన కేసును హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది.
బహిరంగ రహస్యమే...
కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యలో, కృష్ణా నది పక్కన రాజధాని ఏర్పాటవుతుందనడంలో రహస్యం ఏమీ లేదని, ముందు నుంచే ప్రజా బాహుళ్యంలో ఉందంటూ ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన కథనాలను పిటిషనర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని హైకోర్టు తెలిపింది.. ‘‘2014 జూన్ 9న అప్పటి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగానే కృష్ణానది పక్కన రాజధాని నగరం వస్తుందని బహిరంగంగా ప్రకటించారు. ఆ వార్తను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, ప్రాథమిక దర్యాప్తులో సైతం 2014 జూన్- డిసెంబరు మధ్య రాజధాని ప్రాంతంపై ప్రజల్లో ప్రచారం జరుగుతోందని తెలిపారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న ప్రాంతంలో భూముల కొనుగోలును తప్పుపట్టలేం’’ అని జస్టిస్ మానవేంద్ర రాయ్ తన తీర్పులో స్పష్టం చేశారు. ఆస్తులు సంపాదించుకోవడం ప్రజలకు రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కు అని గుర్తు చేశారు. ‘‘విక్రయదారులు స్వచ్ఛందంగా పిటిషనర్లకు భూములను విక్రయించారు. వాటిని రిజస్టర్డ్ దస్తావేజుల ద్వారా పిటిషనర్లు చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేయడాన్ని నేరపూరితమైన చర్యగా పేర్కొనడం సరికాదు’’ అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
సంబంధం లేదు...
‘‘రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన అంశం ఇదివరకే మా ముందుకు విచారణకు వచ్చింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన వ్యవహారం. స్టాక్ మార్కెట్‌లో సెక్యూరిటీలు, బాండ్ల కొనుగోలు, విక్రయ వ్యవహారాలు సెబీ పరిధిలోకి వస్తాయి. సెబీ చట్ట నిబంధనలకు ఐపీసీ సెక్షన్లు వర్తింపచేయడం కుదరదు. భూముల క్రయ విక్రయాలతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ సంబంధం లేదు’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటుగా భూముల క్రయవిక్రయాలు చేసిన వారిని నేరస్తులుగా పేర్కొనడం కుదరదని తెలిపింది. అమరావతిలో భూముల కొనుగోలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదని హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేసింది. ‘‘రాజధాని ఏర్పాటుపై చర్చించే సమయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ అదనపు ఏజీ హోదాలోనే ఉన్నారు.
విధానపరమైన నిర్ణయాల్లో ఏజీకి మాత్రమే చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించే వీలుంటుంది. రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగబద్ధ, చట్టబద్ధమైన విధుల్లో జోక్యం చేసుకునే అవకాశం దమ్మాలపాటికి లేదు. రాజధాని ఏర్పాటు గురించి అదనపు ఏజీగా ఉన్న ఆయనకు తెలిసే అవకాశం లేదు. రాజధాని నగర ప్రాంతాన్ని గుర్తించడం, ఏపీ సీఆర్‌డీఏ చట్టం 2014 అమల్లోకి తీసుకొచ్చే ప్రక్రియలో అదనపు ఏజీకి ఎలాంటి పాత్ర లేదని నిర్ధారిస్తున్నాం’’ అని హైకోర్టు తెలిపింది. మరోవైపు... ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం దమ్మాలపాటి శ్రీనివా్‌సకు రాజధానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ముందే తెలుసునని చెప్పలేదని పేర్కొంది. దమ్మాలపాటి శ్రీనివాస్ అవినీతి నిరోధక చట్టం కింద నేరపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ‘‘దమ్మాలపాటి శ్రీనివాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆర్థిక ప్రయోజనం పొందారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది’’ అని సూటిగా చెప్పింది.
ఇదీ నేపథ్యం..
రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ 2020 సెప్టెంబరు 15న గుంటూరు ఏసీబీ అధికారులు దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు పలువురిపై కేసు నమోదు చేశారు. తన విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని, దురుద్దేశంతో నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేసు విచారణపై స్టే విధిస్తూ... పిటిషనర్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. కేసుకు సంబంఽధించిన వివరాలను ప్రింట్, ఎలకా్ట్రనిక్, సామాజిక మాధ్యమాలలో ప్రచురించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. ఈ ఏడాది జూలై 22న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీని ఉపసంహరించుకుంది. హైకోర్టులో కౌంటర్ వేస్తామని తెలిపింది. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ... విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్. మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూధ్రా, పోసాని వెంకటేశ్వర్లు, జి.సుబ్బారావు, ప్రణతి వాదనలు వినిపించారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించగా... ఫిర్యాదుదారుడి తరఫున న్యాయవాది కౌలా్‌సనాథ్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు.
ఆ వాదన తోసిపుచ్చలేం...
కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసం తమను వేధించడానికే ఫిర్యాదు చేయించారనే పిటిషనర్ల వాదనలు తోసిపుచ్చలేమని హైకోర్టు తెలిపింది. తనపై కేసు నమోదు చేసి, క్రిమినల్ చర్యలు ప్రారంభించి, తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని దమ్మాలపాటి కోరిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాజ్యంలో పరిహారం చెల్లించేలా ఆదేశించడానికి బదులుగా ఫిర్యాదుదారుడిపై తగిన ఫోరాన్ని ఆశ్రయించి పరిహారం పొందే విషయాన్ని దమ్మాలపాటి శ్రీనివా్‌సకే వదిలిపెట్టింది.
